విద్యుత్ శాఖ మంత్రి ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ దాడులు
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ ఇళ్లు, ఆఫీసుల్లో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లో ఏకకాలంలో 50 చోట్ల రైడ్స్ జరుగుతున్నాయి.
దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ నివాసంలో శుక్రవారం ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంత్రి బాలాజీ ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా మంత్రికి చెందిన 40 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడి చేసి సోదాలు చేస్తున్నారు. కరూర్ ప్రాంతానికి చెందిన బాలాజీ సీనియర్ డీఎంకే నాయకుడు.
చెన్నై, కరూర్ ప్రాంతాల్లోని మంత్రి ఇళ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఐటీ అధికారులు దాడులు చేశారు. మంత్రి దగ్గరి బంధువులు, పలువురు కాంట్రాక్టర్ల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు. కాగా, మంత్రి నివాసాలు, కార్యాలయాలపై ఐటీ దాడుల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. సెంథిల్ కుమార్ నివాసంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన ఐటీ అధికారుల వాహనాలను డీఎంకె నేతలు ధ్వంసం చేశారు. అనంతరం ఐటీ అధికారులతో డీఎంకె నేతలు వాగ్వాదానికి దిగారు. ఐటీ అధికారుల బృందంలో ఉన్న మహిళ అధికారిని డీఎంకె శ్రేణులు అడ్డుకున్నారు.