ఐసిస్ ఇండియా చీఫ్ అరెస్ట్.. ఎలా పట్టుకున్నారో తెలుసా ?

దిశ, నేషనల్ బ్యూరో : ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థ‌కు అసోం స్పెషల్‌ టాస్క్‌‌ఫోర్స్‌ షాక్ ఇచ్చింది.

Update: 2024-03-20 17:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ఉగ్రవాద సంస్థ‌కు అసోం స్పెషల్‌ టాస్క్‌‌ఫోర్స్‌ షాక్ ఇచ్చింది. ఐసిస్ ఇండియా చీఫ్‌ హరీస్ ఫారూఖీతో పాటు అతడి సహాయకుడు రెహ్మన్‌ను బుధవారం అరెస్టు చేసింది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించిన లిస్టులో హరీస్‌ ఫారూఖీ పేరు ఉంది. అతడు బంగ్లాదేశ్‌ నుంచి అసోంలోని ధుబ్రీలోకి చొరబడి విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడుతాడనే సమాచారం అసోం స్పెషల్‌ టాస్క్‌‌ఫోర్స్‌‌కు అందింది. దీంతో అలర్ట్ అయిన టాస్క్‌ఫోర్స్ టీం భారీ నిఘా ఆరేషన్‌ చేపట్టి హరీస్‌ ఫారూఖీని అదుపులోకి తీసుకుంది.ఇన్నాళ్లుగా అతడు బంగ్లాదేశ్‌లో ఉంటూ భారత్‌లో విధ్వంసక కార్యకలాపాలకు ప్లానింగ్ చేస్తున్నాడని దర్యాప్తులో వెల్లడైంది. ‘‘మా టీమ్‌కు విశ్వసనీయ సమాచారం అందింది. ఇండియా-బంగ్లాదేశ్‌ బార్డర్‌లో ఐసిస్‌ ఉగ్రవాదులు ఉన్నారని మేం కూడా నిర్ధారించుకున్నాం. బుధవారం ఉదయం వాళ్లు సరిహద్దును దాటే టైంలో మా టీం వారిని అరెస్ట్‌ చేసింది’’ అని అసోం స్పెష్‌ల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఐజీ పార్థసారధి మహంతా వెల్లడించారు. ఐసిస్‌ విస్తరణలో భాగంగా.. భారత్‌లో కొత్తగా నియామకాలు చేపట్టడానికి హరీస్ ఫారూఖీ కుట్ర పన్నాడని తెలిపారు. భారత్‌లోని పలు చోట్ల ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధుల సేకరణకు యత్నిస్తున్నాడని ఆయన చెప్పారు. ఢిల్లీ, లక్నో ప్రాంతాల్లో హరీస్ ఫారూఖీపై పలు ఎన్‌ఐఏ కేసులు పెండింగ్‌లో ఉ‍న్నాయన్నారు. తదుపరి చర్యల కోసం అరెస్ట్‌ చేసిన ఐసిస్‌ ఉగ్రవాదులను ఎన్‌ఐఏకు అప్పగించామని ఐజీ పార్థసారధి పేర్కొన్నారు. కాగా, హర్యానాలోని పానిపట్‌కు చెందిన రెహ్మన్‌ అసలు పేరు అనురాగ్ సింగ్. అతడు ఇస్లాంలోకి మారాక పేరును రెహ్మన్‌‌గా మార్చుకున్నాడు. ఇక ఉగ్రవాది హరీస్ ఫారూఖీ ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్ వాస్తవ్యుడు.

Tags:    

Similar News