రాహుల్ విషయంలో మమత చెప్పిందే బీజేపీ చేస్తోందా?
దేశంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది.
దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు వచ్చే సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో మోడీ వర్సెస్ విపక్షాల మధ్య పొలిటికల్ గేమ్ రోజు రోజుకు చేంజ్ అవుతోంది. మోడీని ఢీ కొట్టాలనే విపక్షాల ప్రయత్నాలు ఓ అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి పడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. ఓ వైపు అధికారంలోకి వచ్చేందుకు మరోసారి బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా మోడీకి రాహుల్ గాంధీనే అతిపెద్ద టీఆర్పీ అని మమతా బెనర్జీ ఆరోపించారు.
గత ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ బీజేపీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక అసెట్ అని ఫైర్ అయ్యారు. అందువల్లనే అనసవరమైన విషయాల్లోనూ రాహుల్‌ను టార్గెట్ చేసి అతడిని హీరోను చేయడానికి కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న ఈ మైండ్ గేమ్‌తో విపక్షాల్లో ఉన్న ఇతర నేతలు మరుగున పడేలా వ్యవహారం జరుగుతోందని ధ్వజమెత్తారు. అయితే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో మరోసారి రాహుల్ గాంధీపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. కోర్టు తీర్పు నేపథ్యంలో బీజేపీ టాప్ లీడర్లు సైతం రాహుల్ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు.
రాహుల్ గాంధీ బీసీలను అవమానించారని జేపీ నడ్డా ధ్వజమెత్తగా రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించినంత మాత్రాన అతని ఇంటి పేరును తాము దూషించలేము అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు విరుచుకుపడ్డారు. అంతకు ముందు విదేశీ గడ్డపై రాహుల్ ప్రసంగంపై బీజేపీ టార్గెట్ చేసింది. దేశాన్ని అవమానించారని, అతడు దేశానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో రాహుల్ ను పదే పదే బీజేజీ టార్గెట్ చేయడంతో మమతా బెనర్జీ చెప్పిందే నిజం అవుతోందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. విపక్షంలోని ఇతర పార్టీ నేతల ఫేమ్ ను తగ్గించడానికి రాహుల్‌ను ఉద్దేశపూర్వకంగానే మోడీ వర్సెస్ రాహుల్ అన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్న వేళ మిగతా విపక్ష పార్టీలు ఎలాంటి స్టెప్ వేయబోతోందనేది ఆసక్తిని రేపుతోంది.