Iran: హిజాబ్ ధరించలేదని దాడి.. అర్ధనగ్నంగా యువతి నిరసన

ఇరాన్‌లో హిజాబ్ ఆంక్షలు కఠినంగా ఉంటాయి. అక్కడి మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించడంతో పాటు స్కార్ఫ్ వేసుకోవాలి.

Update: 2024-11-03 11:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌(Iran)లో హిజాబ్(Hijab) ఆంక్షలు కఠినంగా ఉంటాయి. అక్కడి మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించడంతో పాటు స్కార్ఫ్ వేసుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తాజాగా హిజాబ్ ధరించనందుకు ఇరాన్‌లోని భద్రతా దళాలు(security forces) ఒక యువతిని వేధించాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన యువతి తనపై దాడికి నిరసనగా అర్దనగ్నంగా ప్రదర్శన చేసింది. ఇరాన్‌లోని ఇస్లామిక్ ఆజాద్ విశ్వవిద్యాలయంలో(Islamic Azad University) ఈ ఘటన జరిగింది. యువతి తన బట్టలు విప్పేసి కేవలం లో దుస్తులతోనే యూనివర్సిటీ వద్ద తిరిగింది. క్యాంపస్ గేటు వద్ద కూర్చొని వచ్చే పోయే విద్యార్థులతో మాట్లాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యూనివర్శిటీ క్యాంపస్‌లో మహిళ అర్ధ నగ్నంగా కూర్చోవడంతో భద్రతా సిబ్బంది ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపించింది. అనంతరం సెక్యురిటీ గార్డులు యువతిని అదుపులోకి తీసుకున్నారు.

హిజాబ్ ధరించనందునే యువతిని వేధించారని, దీంతో ఆగ్రహించిన ఆమె ఈ చర్యలకు పాల్పడిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటన తర్వాత యూనివర్శిటీ ప్రతినిధి అమీర్ మహ్జోబ్ మాట్లాడుతూ.. మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతుందని, మానసిక సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ఆ మహిళ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. మరోవైపు అరెస్టు సమయంలోనూ యువతిని కొట్టారని స్థానిక కథనాలు పేర్కొన్నాయి. యువతి అరెస్టును అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించింది. ఇరాన్ అధికారులు వెంటనే యువతిని విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

కాగా,ఇరాన్‌లో మహిళలు హిజాబ్ ధరించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం, ఇరాన్‌లో హిజాబ్ ధరించడాన్ని వ్యతిరేకించినందుకు మహ్సా అమిని అనే బాలికను భద్రతా సిబ్బంది కొట్టి చంపారు. దీని తరువాత ఇరాన్ అంతటా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి, దీంతో తాజా ఘటనపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  

Tags:    

Similar News