సైబర్ నేరాల కట్టడికి అంతర్జాతీయ సహకారం అవసరం: సీజేఐ చంద్రచూడ్
ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నందున నేపథ్యంలో మైనర్లకు సంబంధించిన సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నందున నేపథ్యంలో మైనర్లకు సంబంధించిన సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటిని ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సహకారం అవసరమని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. నేపాల్ ప్రధాన న్యాయమూర్తి బిశ్వంభర్ ప్రసాద్ శ్రేష్ఠ ఆహ్వానం మేరకు చంద్రచూడ్ నేపాల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ఆ దేశ రాజధాని ఖాట్మండులో బాలల హక్కులపై నిర్వహించిన జాతీయ సదస్సులో ప్రసంగించారు. మారుతున్న నేరాల స్వభావం, ముఖ్యంగా డిజిటల్ నేరాల వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా బాల్య న్యాయ వ్యవస్థలకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. వాటిని కట్టడి చేసేందుకు అంతర్జాతీయంగా సహకారం అవసరమని చెప్పారు. సంస్కరణ చర్యలపై దృష్టి సారించడం ద్వారా న్యాయమైన, సమానమైన సమాజాన్ని రూపొందించడంలో బాల్య న్యాయం కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
బాల్య న్యాయ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారత్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. జువైనల్ జస్టిస్ చట్టాల అమలులో సామాజిక వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పిల్లలు మంచి వ్యక్తిత్వంతో ప్రపంచంలోకి ప్రవేశిస్తారని, కానీ వారి కుటుంబానికి సంబంధించిన ఆర్థిక కష్టాలు, తల్లిదండ్రుల నిర్లక్ష్యం, తోటివారి ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల వారు తప్పుదారి పట్టే అవకాశం ఉందని నొక్కి చెప్పారు. ఈ సమయంలో న్యాయపరమైన ఘర్షణల్లో చిక్కుకున్న పిల్లలను గమనించి వారి ప్రత్యేక అవసరాలను గుర్తించాలని తెలిపారు. హ్యాకింగ్, సైబర్ బెదిరింపు, ఆన్‌లైన్ మోసం, డిజిటల్ వేధింపుల వంటి సైబర్ నేరాల్లో ఎక్కువగా యువకులే చిక్కుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై యువకులకు అవగాహన కల్పించడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే దేశీయ స్థాయిలో, బాలల న్యాయ వ్యవస్థలో పాలుపంచుకున్న వారందరికీ బాలల రక్షణ నియమాలలో నిర్దిష్ట శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.