కేంద్రం వాటాలో కర్ణాటకకు అన్యాయం: ఢిల్లీలో సీఎం సిద్ధరామయ్య నిరసన
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలిపారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం తమ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలిపారు. రాష్ట్రానికి నిధులు విడుదల చేయడంలో కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని మండిపడ్డారు. దేశంలో పన్ను వసూళ్లలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. కర్ణాటక రెండో స్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి రూ.100 పంపిస్తే.. తిరిగి రూ.12-13 మాత్రమే తిరిగి వస్తున్నాయని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం అమలులోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాలో కర్ణాటక వాటా 4.17శాతం నుంచి 3.64 శాతానికి తగ్గిందని.. దీని వల్ల రాష్ట్రానికి రూ.62,098 కోట్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం కర్ణాటకకే గాక.. దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ అన్యాయం జరుగుతుందని తెలిపారు. కేంద్రం సవతి తల్లిలా వ్యవహరిస్తూ.. సమాఖ్య వ్యవస్థను అగౌరవపరుస్తోందని ఆరోపించారు. కేంద్రం స్పందించి వెంటనే నిధులు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలను మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
రావాల్సిన వాటాను మాత్రమే అడుగుతున్నాం: డిప్యూటీ సీఎం శివకుమార్
నిరసనల్లో భాగంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ. గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వాటా ఇస్తుందో అదే తరహాలో కర్ణాటకకు కూడా ఇవ్వాలన్నారు. మాకు రావాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. దేశంలోనే అత్యధిక ఆదాయాన్ని ఇస్తున్న రాష్ట్రం కర్ణాటక అని తెలిపారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా చెప్పుకునే బీజేపీ ఇంతకుముందు కూడా రాష్ట్రానికి సరైన గ్రాంట్లు ఇవ్వలేదని ఆరోపించారు. మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ చేస్తున్న ధర్నాను రాష్ట్ర బీజేపీ నేతలు వ్యతిరేకించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగళూరులోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.