Jabalpur: పట్టాలు తప్పిన ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్

ఇటీవల రైల్వేలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా, తాజాగా శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లో ఒక రైలు పట్టాలు తప్పింది.

Update: 2024-09-07 05:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల రైల్వేలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకుంటుండగా, తాజాగా శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లో ఒక రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇండోర్-జబల్‌పూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22191) మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ స్టేషన్‌‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 6 వద్దకు చేరుకునే సమయంలో రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం ఉదయం 5.38 గంటల ప్రాంతంలో జరిగింది. రైలు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న సమయంలో పట్టాలు తప్పడంతో ప్రయాణికులెవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. పట్టాలు తప్పిన కోచ్‌లు ఇంజన్‌కు ఆనుకుని ఉన్నాయి, ప్లాట్‌ఫారమ్‌కు దాదాపు 50 మీటర్ల దూరంలో పట్టాలు తప్పాయి.

జబల్‌పూర్ రైల్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మాట్లాడుతూ, రైలు షెడ్యూల్ సమయం ఉదయం 5.35, జబల్‌పూర్ స్టేషన్‌లోకి ప్రవేశించే సమయంలో 5.38 గంటలకు పట్టాలు తప్పింది. లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేసి, ఇతర కోచ్‌లు పడిపోకుండా కాపాడారు. ఇంజన్‌కు ఆనుకుని ఉన్న రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి, అయితే అదృష్టవశాత్తూ, ఈ సంఘటనలో ప్రయాణీకులెవరూ గాయపడలేదని చెప్పారు. స్టేషన్‌లోని ఆరో నంబర్ ప్లాట్‌ఫాం మాత్రమే కార్యకలాపాల కోసం మూసివేయడం వలన మిగిలిన రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రాఫిక్‌పై పెద్దగా ప్రభావం లేదని, ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.


Similar News