మరోసారి ప్రధానిగా మోడీ.. కలిసొచ్చే అంశాలివే..

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ‘లోక్‌నీతి - సీఎస్‌డీఎస్’ సర్వేలో కీలక విషయాలు వెలుగుచూశాయి.

Update: 2024-04-12 19:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల వేళ ‘లోక్‌నీతి - సీఎస్‌డీఎస్’ సర్వేలో కీలక విషయాలు వెలుగుచూశాయి. మన దేశ ఓటర్లు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం (ధరల మంట)ను ప్రధాన సమస్యలుగా పరిగణిస్తున్నారని వెల్లడైంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలమైన నాయకత్వం, ప్రపంచ స్థాయిలో భారత్‌కు పెరుగుతున్న ప్రతిష్ఠ అనేవి మరోసారి ఎన్నికల్లో మోడీకి కలిసి రావచ్చని సర్వేలో తేలింది. వరుసగా మూడోసారి ప్రధాని పీఠం దాకా వెళ్లేందుకు నరేంద్రమోడీకి ఈ అంశాలే దన్నుగా నిలిచే ఛాన్స్ ఉందని పేర్కొంది. సర్వేలో భాగంగా దేశంలోని 19 రాష్ట్రాలకు చెందిన 10,000 మంది ఓటర్లను సర్వే చేశారు. వారిలో 27 శాతం మంది నిరుద్యోగమే తమకు అత్యంత ఆందోళనకర అంశమని చెప్పారు. ధరల పెరుగుదల తమ జీవితాలను ప్రశ్నార్ధకంగా మారుస్తోందని 23 శాతం మంది తెలిపారు. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికంగా 62 శాతం (మూడింట రెండు వంతుల) మంది గత ఐదేళ్లలో ఉద్యోగాల అన్వేషణ కష్టతరంగా మారిందన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది ప్రధాని మోడీ సర్కారు తీసుకున్న గొప్ప నిర్ణయమని సర్వేలో పాల్గొన్న 22 శాతం మంది పేర్కొన్నారు. అయితే తమకు అది ముఖ్యమైన అంశమేం కాదని 8 శాతం మంది చెప్పారు. అయోధ్య రామాలయం దేశంలోని హిందువులను ఏకీకృతం చేస్తుందని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. భారతదేశం హిందువులతో పాటు అన్ని మతాల పౌరులకూ సరి సమానంగా చెందినదని సర్వేలో పాల్గొన్న 79 శాతం మంది తెలిపారు.

Tags:    

Similar News