ప్రొటీన్ పౌడర్ అతిగా వాడారో.. అవి దెబ్బతింటాయ్ : ‘ఐసీఎంఆర్ - ఎన్ఐఎన్’
దిశ, నేషనల్ బ్యూరో : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి.
దిశ, నేషనల్ బ్యూరో : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకోవాలి ? ఎంత తీసుకోవాలి ? అనే వివరాలతో ఇప్పటికే మన దేశంలో ‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్’ అందుబాటులో ఉంది. తాజాగా దీన్ని హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించే ఐసీఎంఆర్ అనుబంధ సంస్థ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) సవరించింది. మార్గదర్శకాల సవరణ అనేది ఆషామాషీగా జరగలేదు. ఎన్ఐఎన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్.హేమలత నేతృత్వంలోని నిపుణులతో కూడిన టీమ్ లోతుగా రీసెర్చ్ చేసింది. అనేక శాస్త్రీయ అంశాలను సమీక్షించింది. ఆ తర్వాతే భారతీయులంతా తప్పకుండా పాటించాల్సిన 17 ఆహారపరమైన మార్గదర్శకాలను ఎన్ఐఎన్ జారీ చేసింది. వాటిలో ఏయే అంశాలున్నాయో ఇప్పుడు చూద్దాం..
ఎన్ఐఎన్ మార్గదర్శకాలు ఇవీ..
* ప్రొటీన్ పౌడర్లను అతిగా వాడితే మన ఎముకలలోని మినరల్స్ తొలగిపోతాయని, మూత్రపిండాలు దెబ్బతినే రిస్క్ కూడా ఉంటుందని ఎన్ఐఎన్ హెచ్చరించింది.
* శరీరానికి శక్తిని (కేలరీలను) అందించే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. శరీరానికి చక్కెరల ద్వారా అందించే కేలరీలు 5 శాతంలోపే ఉండాలి.
* తృణధాన్యాలు, మిల్లెట్ల నుంచి 45 శాతంలోపు కేలరీలను.. పప్పులు, బీన్స్, మాంసం నుంచి 15 శాతం వరకు కేలరీలను శరీరానికి అందించవచ్చు.
* శరీరానికి అవసరమైన మిగిలిన కేలరీలను డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, పండ్లు, పాల నుంచి పొందాలి.
* శరీరానికి అందించే మొత్తం కేలరీలలో 30 శాతంలోపే కొవ్వు సంబంధిత ఆహార పదార్థాలు, ఆహార ఉత్పత్తులు ఉండాలి.
* పప్పుధాన్యాలు, మాంసం ధరలు మండిపోతుండటంతో దేశ ప్రజలు ఎక్కువగా తృణధాన్యాలనే ఆహారంలో వినియోగిస్తున్నారని ఎన్ఐఎన్ తెలిపింది. దీనివల్ల శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ అందడం లేదు. ఫలితంగా జీవక్రియల్లో అంతరాయం ఏర్పడుతోంది. వెరసి చిన్న వయసులోనే ఎంతోమంది శరీరంలో ఇన్సులిన్ నిరోధకతతో ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
* మన దేశంలో ఇన్సులిన్ సంబంధిత వ్యాధుల బారినపడుతున్న వారిలో 56.4 శాతం మంది ఆరోగ్య సమస్యలకు అనారోగ్యకరమైన ఆహారమే కారణమని ఎన్ఐఎన్ పేర్కొంది.
* ఆరోగ్యకరమైన ఆహారం, తగిన శారీరక శ్రమ వల్ల గుండె జబ్బులు, హైపర్ టెన్షన్ వంటివి అలుముకునే ముప్పు చాలా వరకు తగ్గుతుంది. టైప్-2 డయాబెటిస్ వచ్చే రిస్క్ కూడా 80 శాతం వరకు తగ్గిపోతుందని నివేదిక చెప్పింది.
* చక్కెరలు, కొవ్వులు, ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్, శారీరక శ్రమ తగ్గడం వల్ల ఊబకాయం వంటి సమస్యలతో యువత బాధపడుతున్నారని ఎన్ఐఎన్ వెల్లడించింది.