1984లో అదృశ్యమైన సైనికుడి మృత దేహాన్ని కనుగొన్న భారత్ ఆర్మీ!
2,000 కంటే ఎక్కువ మంది సైనికులు ఇక్కడ ప్రాణాలను కోల్పోయారు. Chander Shekhar's Mortal remains found after 38 years.
దిశ, వెబ్‌డెస్క్ః భారత సైన్యం పోరాట సామర్థ్యానికి 1984లో సియాచిన్ స్వాధీనం ఒక మచ్చుతునక. అయితే, ఆనాటి ఆర్మీ ఆపరేషన్ మేఘ్‌దూత్‌లో తప్పిపోయిన సైనికుడి మృత దేహాన్ని 38 ఏళ్ల తర్వాత కనుగొన్నట్లు భారత సైన్యం నార్త్ కమాండ్ ఆగస్టు 15న ప్రకటించింది. అధికారిక రికార్డులను బట్టి, మే 29, 1984న గ్యోంగ్లా గ్లేసియర్ వద్ద అదృశ్యమైన ఈ సైనికుడు ఆర్మీ నంబర్, తదితర వివరాలు ఉన్న గుర్తింపు డిస్క్ సహాయంతో అతన్ని గుర్తించామని భారత సైన్యం ట్విట్టర్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా నార్త్ ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేదితో పాటు అన్ని ర్యాంకుల అధికారులు ఎల్‌ఎన్‌కె (లేట్) చందర్ శేఖర్‌కు శెల్యూట్ చెప్పగా, ఆపరేషన్ మేఘదూత్‌లో ఇది అత్యున్నత త్యాగం అని, మృత దేహాన్ని త్వరలో కుటుంబానికి అందజేస్తామని అధికారులు తెలియజేసినట్లు ANI నివేదించింది.
38 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియర్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో ఏప్రిల్ 13, 1984న ఆపరేషన్ మేఘదూత్ ప్రారంభించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమిలో జరిగిన మొదటి ఆర్మీ ఆపరేషన్ కావడంతో దీనికి విలక్షణమైన గుర్తింపు ఉంది. ఈ ఆపరేషన్‌లో సియాచిన్ గ్లేసియర్ మొత్తాన్ని భారత సైనికులు తమ ఆధీనంలోకి తీసుకోగలిగారు. అప్పటి భారతదేశం, పాకిస్తాన్ యుద్ధంలో సియాచిన్ ప్రాంతం ఇరు దేశాల మధ్య అత్యంత ఎత్తైన యుద్ధభూమిగా ఉంది. రెండు దేశాలూ ఈ ప్రాంతంలో నిరంతరం సైనికుల్ని మొహరించి ఉంచేవి. ఇక్కడ ఉన్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, తరచుగా పర్వతాలు విరిగిపడటం వంటి సహజ ప్రమాదాల కారణంగా, అత్యంత ప్రతికూల వాతావరణంలో 2,000 కంటే ఎక్కువ మంది సైనికులు ఇక్కడ ప్రాణాలను కోల్పోయారు. వారిలో చందర్ శేఖర్ కూడా అమరులయ్యారు.