రైల్వే కేటాయింపులపై మంత్రి అశ్విని వైష్ణవ్
అందులో రైల్వేల భద్రతా సంబంధిత అవసరాలకు రూ. 1.08 లక్షల కోట్లు వినియోగిస్తామని ఆయన చెప్పారు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌లో రైల్వే శాఖకు రూ. 2.62 లక్షల కోట్లు ప్రభుత్వం కేటాయించిందని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అందులో రైల్వేల భద్రతా సంబంధిత అవసరాలకు రూ. 1.08 లక్షల కోట్లు వినియోగిస్తామని ఆయన చెప్పారు. ఇది భారత రైల్వేకు కేటాయించిన రికార్డు మొత్తమని, రూ. 1.08 లక్షల కోట్లతో పాత ట్రాక్‌ల పునరుద్ధరణ, సిగ్నలింగ్ వ్యవస్థలను మెరుగుపరచడం, కవచ్ వ్యవస్థ ఏర్పాటు, ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటి పనులను వాడనున్నట్టు ఆయన వివరించారు. ఇందులోనూ కవవ్ వ్యవస్థకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇటీవలే హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, ఆప్టికల్ ఫైబర్, టెలికాం టవర్, ఆన్ ట్రాక్ సిస్టమ్, డేటా సెంటర్ అడ్మినిస్ట్రేషన్‌తో కూడిన ‘కవచ్ 4.0’ సేఫ్టీ సిస్టమ్‌కు భారతీయ రైల్వే ఇటీవల ఆమోదం తెలిపింది. ఇది వేగవంతంగా ఇన్‌స్టాల్ చేస్తామని వైష్ణవ్ తెలిపారు. దేశంలో జనరల్ కోచ్‌లలో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, రైల్వేలు ఇటీవల 2,500 జనరల్ కోచ్‌లను తీసుకురానుది, అలాగే భవిష్యత్తులో మరో 10,000 అదనపు జనరల్ కోచ్‌లను తయారు చేయాలని నిర్ణయించినట్టు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ బడ్జెట్ కేటాయింపుల సాయంతో వందే మెట్రో, వందే భారత్, అమృత్ భారత్ వంటి ప్రాజెక్టులు కూడా కవర్ అవుతాయని మంత్రి పేర్కొన్నారు.