ప్రపంచ ఉత్తమ కాఫీ జాబితాలో భారత 'ఫిల్టర్ కాఫీ'
ఈ జాబితాలో భారత్‌లో తయారీ పద్దతి ఫిల్టర్ కాఫీ ప్రపంచ ఉత్తమ రెండో ర్యాంకును సాధించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోని చాలామందికి ఉదయం లేవగానే కాఫీ పడకపోతే రోజు మొదలవదు. కాస్తంత చేదుగా గొంతులో కాఫీ పడితేనే గానీ ఉత్సాహం రాదు. అలాంటి కాఫీల్లో ఎన్నెన్నో వెరైటీలు, ప్రపంచవ్యాప్తంగా కాఫీ తయారు చేసే పద్దతులు అనేక రకాలు ఉన్నాయి. ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ ప్లాట్‌ఫామ్ టేస్ట్అట్లాస్ ఇటీవల 'ప్రపంచంలోనే ఉత్తమ 38 కాఫీలు' జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌లో తయారీ పద్దతి ఫిల్టర్ కాఫీ ప్రపంచ ఉత్తమ రెండో ర్యాంకును సాధించింది. అగ్రస్థానంలో క్యూబాకు చెందిన 'క్యూబన్ ఎస్‌ప్రెసో' నిలిచింది. ఫిల్టర్ కాఫీ గురించి టేస్ట్అట్లాస్ తన నివేదికలో వివరించింది. 'భారత్‌కు చెందిన ముఖ్యంగా సౌత్ ఇండియన్ కాఫీస్ ఫిల్టర్ సాధారణ ఫిల్టర్ గిన్నెలో సిద్ధం చేస్తారు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ గిన్నె రెండు భాగాలుగా ఉంటుంది. పై భాగంలో చిల్లులు కలిగి అందులో కాఫీ పొడిని వేస్తారు. కింద ఉండే భాగంలో వేడి నీళ్ల ద్వారా కాఫీ చేరుతుంది. ఈ మిశ్రమంలో వెచ్చటి పాలు, చక్కెర కలిపి కాఫీని తాగుతారని ' వివరించింది. ఈ కాఫీ ప్రధానంగా దక్షిణ భారతంలో ఎక్కువ ప్రాచుర్యం కలిగి ఉందని పేర్కొంది. టేస్ట్అట్లాస్ రూపొందించిన ర్యాంకిన్స్‌లో క్యూబన్ ఎస్‌ప్రెసో, ఫిల్టర్ కాఫీ తర్వాత టాప్-10 జాబితాలో గ్రీస్‌కు చెందిన ఎస్‌ప్రెసో ఫ్రెడో, ఫ్రెడో క్యాపుచినో, ఫ్రాపె, ఇటలీకి చెందిన క్యాపుచినో, రిస్‌రెటో, టర్కీకి చెందిన టర్కీష్ కాఫీ, జర్మనీకి చెందిన ఈస్‌కాఫీ, వియత్నాంకు చెందిన వియత్నమీస్ ఐస్‌డ్ కాఫీలు ఉన్నాయి.