Rajnath Singh : ‘ఇండియా’ కూటమి చిచ్చుబుడ్డిలా తుస్‌మనడం ఖాయం : రాజ్‌నాథ్
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్(Jharkhand)లోని ఇండియా కూటమి దీపావళి చిచ్చుబుడ్డి లాంటిదని.. శక్తివంతమైన రాకెట్ లాంటి బీజేపీ ఎదుట నిలవలేక అది తుస్‌మనడం ఖాయమని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో : జార్ఖండ్(Jharkhand)లోని ఇండియా కూటమి దీపావళి చిచ్చుబుడ్డి లాంటిదని.. శక్తివంతమైన రాకెట్ లాంటి బీజేపీ ఎదుట నిలవలేక అది తుస్‌మనడం ఖాయమని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) విమర్శించారు. రాష్ట్ర రాజధాని రాంచీ పరిధిలోని హాతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. అద్భుత శక్తులు కలిగిన రాకెట్ లాంటి బీజేపీ గెలిస్తే జార్ఖండ్ రాష్ట్రం అభివృద్ధి ప్రయాణంలో కొత్త మైలురాళ్లను చేరడం ఖాయమన్నారు.
గత ఎన్నికల్లో బర్హైత్ అసెంబ్లీ స్థానంలో సీఎం హేమంత్ సోరెన్ నామినేషన్‌కు ప్రపోజర్‌గా వ్యవహరించిన మండల్ ముర్ము కూడా బీజేపీలో చేరిపోయిన విషయాన్ని ఈసందర్భంగా రాజ్‌నాథ్ గుర్తు చేశారు. బీజేపీ గెలుపు ఖాయం అనేందుకు ఇలాంటి పరిణామాలు నిదర్శనమన్నారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) తన పేరును ‘జమ్ కర్ మలాయీ మారో’ (కూడబలుక్కొని మీగడ చిలకండి) అని మార్చుకుంటే బెటర్ అని ఆయన సూచించారు. అధికార జేఎంఎం రాష్ట్రంలోని గిరిజనుల రక్తాన్ని పీల్చిందని, వారి ప్రయోజనాలను దెబ్బతీసిందని రక్షణమంత్రి ఆరోపించారు. ‘‘జార్ఖండ్‌లోకి విదేశీయులు ఎలా చొరబడుతున్నారో సీఎం హేమంత్ సోరెన్ చెప్పాలి. రాష్ట్రంలోని గిరిజనుల జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయిందో వివరణ ఇవ్వాలి’’ అని రాజ్‌నాథ్ ప్రశ్నించారు.