Indian Embassy: అమెరికాలోని భారతీయులకు రాయబార కార్యాలయం అడ్వైజరీ
అమెరికాలోని రాయబార కార్యాలయం(Indian Embassy) అక్కడి భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. దౌత్యకార్యాలయం పేరుతో నకిలీ కాల్స్(Fraud calls) వస్తున్నాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని రాయబార కార్యాలయం(Indian Embassy) అక్కడి భారతీయులకు అడ్వైజరీ జారీ చేసింది. దౌత్యకార్యాలయం పేరుతో నకిలీ కాల్స్(Fraud calls) వస్తున్నాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత సమాచారం, క్రెడిట్ కార్డు వివరాలు వెల్లడించవద్దని పేర్కొంది. భారతీయుల నుండి డబ్బు వసూలు చేయడానికి కూడా వారు ప్రయత్నిస్తారన్నారు. పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్ ఫారమ్, వీసాలో తప్పులు ఉన్నాయని చెబుతూ సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ తప్పులను సవరించడానికి డబ్బు చెల్లించాలని పేర్కొంటూ సైబర్ నేరగాళ్లు భారతీయ పౌరుల నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ఈ లోపాలను సరిదిద్దుకోకపోతే ప్రస్తుతం అమెరికా పాటిస్తున్న నిబంధనల ప్రకారం తిరిగి భారత్‌కు పంపించివేస్తామని.. లేదంటే జైలు శిక్ష విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. అటువంటి కాల్స్ వస్తే భయపడకుండా తమకు సమాచారం అందించాలని సూచించింది.
మోసపూరిత కాల్స్ వచ్చినట్లు ఫిర్యాదులు
అమెరికాలోని భారతీయులతో పాటు, వీసా దరఖాస్తుదారులకు ఇటువంటి మోసపూరిత కాల్స్ వచ్చినట్లు తమకు ఫిర్యాదులు అందాయని రాయబార కార్యాలయం పేర్కొంది. అందుకే హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భారత రాయబార కార్యాలయానికి సంబంధించిన అధికారులెవరూ ప్రజల వ్యక్తిగత సమాచారం కోరుతూ ఫోన్‌కాల్స్ చేయరని..“@mea.gov.in” అనే అధికారిక మెయిల్ ద్వారానే సంప్రదిస్తారని అన్నారు. ఈ విషయంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరికైనా ఫేక్ కాల్స్ వస్తే cons1.washington[at]mea.gov.in లేదా cpers.washington@mea.gov.in ద్వారా రాయబార కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది. ఇకపోతే, రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమవలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులను సైనిక విమానాల్లో వెనక్కి పంపివేశారు.