‘ఆకాశ్’ మిస్సైల్ పరీక్ష సక్సెస్.. ఇదిగో వీడియో
దిశ, నేషనల్ బ్యూరో : ఉపరితలం నుంచి గగనతలం వైపుగా దూసుకెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించగల ‘ఆకాశ్’ క్షిపణి వ్యవస్థను భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది.
దిశ, నేషనల్ బ్యూరో : ఉపరితలం నుంచి గగనతలం వైపుగా దూసుకెళ్లి శత్రు లక్ష్యాలను ఛేదించగల ‘ఆకాశ్’ క్షిపణి వ్యవస్థను భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. భారత రక్షణ దళాల కార్యాచరణ సంసిద్ధతను అంచనా వేసేందుకు ఈ మిస్సైల్‌ను టెస్ట్ చేశారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. దీనికి చెందిన రెండు వర్షన్లను భారత వైమానిక దళం, భారత సైన్యం కోసం తయారు చేసింది. మొదటి బ్యాచ్ ఆకాశ్ క్షిపణులను 2012 మార్చిలో భారత వాయుసేనకు ప్రయోగాత్మకంగా అందించారు. అయితే అధికారికంగా వాయుసేనకు అందించింది మాత్రం 2015 జులైలో!! ఇక పూర్తిస్థాయి ఆకాశ్ మిస్సైళ్లను 2015 మేలో భారత సైన్యానికి అప్పగించారు.
ఏక కాలంలో గగనతలంలోని ఒకటికి మించి విమానాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం ఆకాశ్ క్షిపణి వ్యవస్థకు ఉంది. ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్‌లో లాంచర్, క్షిపణి, సమగ్ర మిషన్ గైడెన్స్ సిస్టమ్, మల్టీ ఫంక్షనల్ ఫైర్ కంట్రోల్ రాడార్, సిస్టమ్ ఆర్మింగ్ అండ్ ఎక్స్‌ప్లోషన్ మెకానిజం, డిజిటల్ ఆటోపైలట్, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇంటెలీజెన్స్ సెంటర్, సపోర్టింగ్ గ్రౌండ్ ఎక్విప్‌మెంట్ అంతర్భాగంగా ఉంటాయి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగానే నాగ్, అగ్ని, త్రిశూల్, పృథ్వీ మిస్సైళ్లను తయారు చేశారు.