మూడేళ్లలో నక్సలిజం అంతం: అమిత్ షా
నక్సల్స్ కార్యకలాపాలపై సమీక్షకు వెళ్లినప్పుడల్లా మీ ధైర్య సాహసాల గురించి వింటూనే ఉంటాను.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలో మరో మూడేళ్లలో దేశంలో నక్సలిజం పూర్తిగా అంతం కానుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అసోంలోని తేజ్‌పూర్‌లో శనివారం నిర్వహించిన సరిహద్దు రక్షణ దళం 60వ సశత్ర సీమా బల్(ఎస్ఎస్‌బీ) రైజింగ్ డేలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘మోడీ నాయకత్వంలోని భారతదేశానికి, రానున్న మూడేళ్లలో నక్సలిజం నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఈ విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నా’’ అని తెలిపారు. అలాగే, నక్సల్స్‌పై పోరాడుతున్న ఎస్ఎస్‌బీ ధైర్య సాహసాలను అమిత్ షా కొనియాడారు. ‘‘ఎస్ఎస్‌బీ దళాలు నేపాల్, భూటాన్ వంటి స్నేహపూర్వక దేశాల సరిహద్దులను రక్షించడంతోపాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో నక్సలైట్లకు వ్యతిరేకంగానూ అద్భుతంగా పోరాడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో నక్సల్స్ కార్యకలాపాలపై సమీక్షకు వెళ్లినప్పుడల్లా మీ(ఎస్ఎస్‌బీ) ధైర్య సాహసాల గురించి వింటూనే ఉంటాను’’ అని అన్నారు. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీ దళాల నిరంతర కృషితో నక్సల్స్‌పై పోరాటం చివరి దశకు చేరుకుందని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరాటంలోనూ తమ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని అమిత్ షా గుర్తుచేశారు. ఎస్ఎస్‌బీ 60వ రైజింగ్ డేను పురస్కరించుకుని కేంద్రం పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసిందని తెలిపారు. విధుల పట్ల ఎస్ఎస్‌బీకి ఉన్న నిబద్ధతను ఈ పోస్టల్ స్టాంపు దేశ ప్రజల ముందు ఎన్నటికీ సజీవంగా ఉంచుతుందని చెప్పారు. చైనా-భారత్ యుద్ధం తర్వాత 1963లో ఏర్పడిన ఎస్ఎస్‌బీకి గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమిత్ షాతోపాటు అసోం సీఎం హిమంత విశ్వ శర్మ పాల్గొన్నారు.