భారత్-అమెరికాల జెట్ ఇంజిన్ డీల్ విప్లవాత్మకమైనది: యూఎస్ రక్షణ కార్యదర్శి ఆస్టిన్
భారత్-అమెరికాల మధ్య గతేడాది జూన్‌లో కుదిరిన జెట్ ఇంజిన్ డీల్ ఎంతో విప్లవాత్మకమైందని యూఎస్ రక్షణ కార్యదర్శి లూయిడ్ ఆస్టిన్ కొనియాడారు.
దిశ, నేషనల్ బ్యూరో: భారత్-అమెరికాల మధ్య గతేడాది జూన్‌లో కుదిరిన జెట్ ఇంజిన్ డీల్ ఎంతో విప్లవాత్మకమైందని యూఎస్ రక్షణ కార్యదర్శి లూయిడ్ ఆస్టిన్ కొనియాడారు. యూఎస్ చట్టసభల సమావేశంలో ఆస్టిన్ ప్రసంగించారు. ఆస్టిన్ హౌస్ అప్రాప్రియేషన్స్ సబ్‌కమిటీకి భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని తెలిపారు. ‘ఇటీవల భారత్‌లో ఒక జెట్ వెపన్, జెట్ ఇంజిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదిరింది. ఇది ఎంతో విప్లవాత్మకమైంది. అంతేగాక భారత్‌కు గొప్ప సామర్థ్యాన్ని అందిస్తుంది’ అని తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని కూడా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు.
ఒప్పందం ఏంటి?
గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా జెట్ ఇంజిన్ డీల్ కుదిరింది. దీని ప్రకారం.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఫైటర్ జెట్ ఇంజిన్లను తయారు చేసేందుకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌తో అవగాహన ఒప్పందం కుదిరింది. భారతదేశ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సీఏ), తేజస్ ఎంకే2 కోసం F414 ఇంజిన్ తయారీ చేయడమే దీని ఉద్దేశం. ఈ అగ్రిమెంట్‌పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. F414 ఇంజిన్‌ను సుమారు 30 సంవత్సరాల నుంచి యూఎస్ నావికాదళం ఉపయోగిస్తోంది. ఈ ఇంజిన్ ఇప్పటికే ఎనిమిది దేశాల్లో సైనిక విమానాలకు శక్తినిస్తుంది.
కాగా, ఈ ఒప్పందం భారత్‌కు ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం భారత సాయుధ దళాలు రష్యా ఆయుధాలు, సైనిక పరికరాలపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి. రష్యాకు చెందిన సుఖోయ్-30, మిగ్-29, ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ భారత్ వద్ద ఉన్నాయి. అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మిగిలిన వాటిని అందించడం రష్యాకు క్లిష్టంగా మారింది. అంతేగాక ప్రస్తుత యుద్ధంలో రష్యా యుద్ధ పరికరాలు తగిన ఫలితాలివ్వలేదని తెలుస్తోంది. దీంతో భారత్ రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాతో జెట్ ఇంజిన్ డీల్ కుదుర్చుకున్నట్టు పలువురు భావిస్తున్నారు.