300 సీట్లతో అధికారంలోకి ‘ఇండియా’: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఇండియా కూటమి 300కు పైగా లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీమా వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి 300కు పైగా లోక్ సభ స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఇండియా అలయెన్స్ తదుపరి కూటమిని ఏర్పాటు చేయడం ఖాయమని చెప్పారు. ‘దేశంలో ఐదో దశ పోలింగ్ ముగిసింది. ఇప్పటి వరకు వెలువడిన అన్ని సర్వేలూ ఇండియా వైపే మొగ్గు చూపాయి. 300 సీట్లలో గెలుపొందుతుందని వెల్లడించాయి’ అని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్‌కు ప్రజల నుంచి గణనీయమైన మద్దతు ఉందని తెలిపారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా పైనా కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ఢిల్లీలో జరిగిన అమిత్ షా ర్యాలీకి 500 మంది కూడా హాజరు కాలేదు. ఢిల్లీలో దేశ ప్రజలపై అమిత్ షా దుర్భాషలాడటం ప్రారంభించారు. ఆప్ మద్దతు దారులను పాకిస్థానీలతో పోల్చారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కు 70 సీట్లకు గాను 62 సీట్లు ఇచ్చారు. పంజాబ్ లో 117కు 92 సెగ్మెంట్లలో గెలిపించి అధికారాన్ని కట్టబెట్టారు. ఢిల్లీ, పంజాబ్ ప్రజలు పాకిస్థానీలా?’ అని ప్రశ్నించారు. అలాగే గుజరాత్ ప్రజలు ఆప్ కు 14 శాతం ఓట్లు ఇచ్చారు. వాళ్ళు కూడా పాకిస్తానీలేనా? అని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, అసోం, మధ్యప్రదేశ్ వంటి చోట్ల స్థానిక ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు ఎన్నికైన విషయాన్ని గుర్తు చేశారు. అమిత్ షాకు అహంకారం పెరిగి పోయిందని విమర్శించారు.
మోడీ తన వారసుడిగా అమిత్ షాను ఎంచుకున్నారు. కానీ బీజేపీ గెలవడం లేదు కాబట్టి ఆయన ఎన్నటికీ ప్రధాని కాలేరని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ తనను దుర్భాషలాడారని, కానీ ఆయనకు అసలు శత్రువులు బీజేపీలోనే ఉన్నారని ఆరోపించారు. యోగీని తొలగించడానికి మోడీ, అమిత్ షాలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశారని నొక్కి చెప్పారు. దేశాన్ని రక్షించాలంటే ఇండియా కూటమికి ఓటు వేయాలని సూచించారు. కాగా, ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్ సభ స్థానాలకు మే 25న ఒకే సారి ఎన్నికలు జరగనున్నాయి.