రష్యాలో 2 కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించనున్న భారత్‌: మాస్కోలో ప్రధాని మోడీ

మన దేశ కష్టసుఖాల్లో రష్యా ఎప్పుడూ తోడుగానే ఉంది.

Update: 2024-07-09 11:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలోని కజాన్, యెకటెరిన్‌బర్గ్ నగరాల్లో రెండు కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించనున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. రెండు రోజుల పర్యటన కోసం రష్యాకు వెళ్లిన ప్రధాని మోడీ మాస్కోలో భారత సంతతికి చెందిన వారిని ఇద్దేశించి ప్రసంగించారు. 'తన హయాంలో భారత ఘనతను ప్రపంచ దేశాలు గుర్తించే స్థాయికి తీసుకొచ్చాం. సవాళ్లను ఎదుర్కొనడం తన తత్వమని, అది తన డీఎన్ఏలోనే ఉంది. ఇదే సమయంలో భారత్, రష్యా అనుబంధం కొత్త దశలో పయనిస్తోంది. మన దేశ కష్టసుఖాల్లో రష్యా ఎప్పుడూ తోడుగానే ఉంది. యుద్ధ ప్రాంతాల నుంచి భారత విద్యార్థులు సురక్షితంగా బయటపడేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన సాయానికి ధన్యవాదాలు అనీ మోడీ అన్నారు. రష్యా పర్యటనకు తాను ఒక్కడినే రాలేదని 140 కోట్ల మంది ప్రజల ప్రేమను, దేశ మట్టి పరిమళాన్ని మోసుకొచ్చినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మీ అందరితో శుభవార్తను కూడా పంచుకోవాలని భావిస్తున్నాను. ఇప్పటికే రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్, వ్లాడివోస్టాక్‌లో రెండు కాన్సులేట్‌లు ఉన్నాయి. కొత్తగా మరో రెండుచోట్ల ప్రారంభించాలని నిర్ణయించాం. దీనివల్ల ప్రయాణ, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరచవచ్చని మోడీ పేర్కొన్నారు. అలాగే, భారత ఆర్థికవ్యవస్థ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మారనుంది. వచ్చే 10 ఏళ్లు భారత్‌కు అత్యంత సంక్లిష్ట సమయమని మోడీ అభిప్రాయపడ్డారు. కాగా, యెకటెరిన్‌బర్గ్ రష్యా నాలుగో అతిపెద్ద నగరం, ఇది ముఖ్యమైన ఆర్థిక కేంద్రంగా ఎదుగుతోంది. ఇదే నగరం 2018లో నాలుగు ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది. కజాంకా సైతం సాంస్కృతిక, విద్యా కేంద్రంగా, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక కేంద్రంగా ఉంది.


Similar News