ఐదేళ్లలో చిప్‌ల తయారీలో ప్రపంచ స్థాయికి భారత్

ఈ రంగంలో తైవాన్, దక్షిణ కొరియాల ఆధిపత్యాన్ని భారత్ సవాలు చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Update: 2024-03-03 11:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: వచ్చే ఐదేళ్లలో సెమీకండక్టర్ల తయారీకి సంబంధించి గ్లోబల్ మార్కెట్లో అపారమైన అవకాశాలను భారత్ దక్కించుకోనుందని కేంద్ర ఐటీ, టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్నవ్ అన్నారు. కొత్త ఫ్యాబ్‌లు, చిప్ తయారీ యూనిట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలను అందిస్తుండటంతో ఈ రంగంలో తైవాన్, దక్షిణ కొరియాల ఆధిపత్యాన్ని భారత్ సవాలు చేయనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేంద్ర మంత్రి, భారత ప్రభుత్వ విధానాలతో తయారీదారులు కొత్త ఫ్యాబ్‌లను((సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లు) ఏర్పాటు చేసేందుకు, సంబంధిత రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్ ఇటీవలే రూ. 76 వేల కోట్ల ప్రోత్సాహకాలతో మైక్రాన్, టాటా సహా నాలుగు కంపెనీల సెమీకండక్టర్ తయారీకి ఆమోదం తెలిపిందని మంత్రి వివరించారు.

ఇప్పటికే గ్లోబల్ డిజైన్ నైపుణ్యం కలిగిన వారిలో మూడింట ఒక వంతు భారత్‌కు చెందినవారే ఉన్నారని వైష్ణవ్ చెప్పారు. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది. చైనా నుంచి సరఫరాను మార్చాలని భావిస్తున్న యూఎస్‌తో పాటు ఇతర పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థల ఆశయాలకు భారత్ ఒక అనివార్య భాగస్వామిగా మారింది. ఇటీవల చైనాలో లాక్‌డౌన్ పరిస్థితులు ప్రపంచ చిప్ సరఫరాకు తీవ్ర సమస్యగా మారింది. చిప్‌ల ఉత్పత్తికి ప్రత్యామ్నాయ వనరుల కోసం చూస్తున్న కంపెనీలు ప్రభుత్వాలకు భారత్ అవకాశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో చైనాకు విశ్వసనీయ ప్రత్యామ్నాయ టెక్నాలజీ కేంద్రంగా భారత్ తనను తాను నిరూపించుకుంటోంది. చాలా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు సిద్ధమవ్వాలా అనే ఆలోచన నుంచి ఎప్పుడెప్పుడు భారత్‌లో ఇన్వెస్ట్ చేద్దామా అని చూస్తున్నాయి. సెమీకండక్టర్ల తయారీలో గ్లోబల్ స్థాయిలో కీలక కేంద్రంగా భారత్ నిలుస్తుందని, ఇది వచ్చే ఐదేళ్లలో ఖచ్చితంగా సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు.  


Similar News