చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం!

ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతోంది.

Update: 2023-08-23 16:13 GMT

న్యూఢిల్లీ : ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకోబోతోంది. గత ఏడేళ్లలో తొలిసారిగా.. చక్కెర ఎగుమతులను నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు నెలలో పంచదార ఎగుమతులపై నిషేధాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా చక్కెర ధరలు కొండెక్కుతాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది. ఇథనాల్‌ ఉత్పత్తికి మిగులు చెరకును ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది. స్థానిక చక్కెర అవసరాలు తీర్చడం, మిగులు చెరకుతో ఇథనాల్‌ ఉత్పత్తి చేయడంపైనే దృష్టిసారించాలని ప్లాన్ చేస్తోంది. రాబోయే సీజన్లో ఎగుమతి కోటాకు అవసరమైనంత పంచదార అందుబాటులో ఉండదని ప్రభుత్వ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి.

గత నెలలో భారత ప్రభుత్వం బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిని నిషేధింది. దీంతో చాలా ఆసియా దేశాలు ఉలిక్కిపడ్డాయి. చివరకు అమెరికాలోనూ బియ్యం కోసం జనం డిపార్ట్‌మెంటల్‌ స్టోర్ల ముందు బారులు తీరారు. అయితే జనం భయపడాల్సిన పని లేదని, రైస్‌కు కొదవలేదని అమెరికా రైస్ ఫెడరేషన్ అప్పట్లో ప్రకటించింది. అమెరికా వినియోగిస్తున్న బియ్యంలో చాలా భాగం దేశంలోనే పండుతోందని, ఈ సంవత్సరం బ్రహ్మాండమైన దిగుబడి కూడా వచ్చిందని ప్రజలకు వివరణ ఇచ్చింది. అమెరికా రైస్ ఫెడరేషన్ ఎన్ని విధాలా సర్దిచెప్పినా, అగ్రరాజ్యంలో ఆందోళన కనిపిస్తూనే ఉంది. బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతిపై భారత్‌ విధించిన బ్యాన్‌తో అమెరికా సహా పలు దేశాలపై బాగానే ఎఫెక్ట్‌ పడింది. ఇకపై చక్కెర బ్యాన్ విధిస్తే.. ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Tags:    

Similar News