జపాన్‌లో క్వాడ్ దేశాధినేతల భేటీకి ఇండియా ప్లాన్
జపాన్‌లోని హిరోషిమాలో శుక్రవారం (మే 19) నుంచి జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది.
న్యూఢిల్లీ: జపాన్‌లోని హిరోషిమాలో శుక్రవారం (మే 19) నుంచి జీ7 శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. దీనికి గెస్ట్ కంట్రీ హోదాలో ఇండియాను ఆహ్వానించడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ తరుణంలో క్వాడ్ రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ (క్వాడ్) కూటమికి సంబంధించి భారత్ కీలక ప్రకటన చేసింది. క్వాడ్ కూటమిలో ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ఉన్నాయి. జీ7 సదస్సు ముఖ్య సమావేశాలు ముగియగానే.. హిరోషిమా సిటీలో క్వాడ్ దేశాధినేతలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భారత్ యోచిస్తోందని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా గురువారం వెల్లడించారు.
మే 24న ఆస్ట్రేలియాలోని సిడ్నీలో క్వాడ్ కూటమి భేటీ జరగనున్న తరుణంలో .. ముందస్తుగా భారత్ ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇక ప్రధాని మోడీ మే 19 నుంచి 21 వరకు జపాన్ లో జరిగే జీ 7 సదస్సులో .. మే 22న ఉదయం పపువా న్యూగినియాలో జరిగే ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కో ఆపరేషన్ సదస్సులో.. మే 22న సాయంత్రం నుంచి మే 24 వరకు ఆస్ట్రేలియాలో జరిగే క్వాడ్ సదస్సులో పాల్గొంటారు.