భారత్-మంగోలియా సైనిక విన్యాసాలు.. మేఘాలయాలో ప్రారంభం

భారత్-మంగోలియాల మధ్య 16వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ విన్యాసాలు బుధవారం మేఘాలయాలో ప్రారంభమయ్యాయి. జూలై 16 వరకు నిర్వహించబడే ఈ విన్యాసాలు సెమీ-అర్బన్, పర్వత ప్రాంతాల్లో అత్యవసర కార్యకలాపాల కోసం ఉమ్మడి సైనిక సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.

Update: 2024-07-03 16:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్-మంగోలియాల మధ్య 16వ ఎడిషన్ జాయింట్ మిలిటరీ విన్యాసాలు బుధవారం మేఘాలయాలో ప్రారంభమయ్యాయి. జూలై 16 వరకు నిర్వహించబడే ఈ విన్యాసాలు సెమీ-అర్బన్, పర్వత ప్రాంతాల్లో అత్యవసర కార్యకలాపాల కోసం ఉమ్మడి సైనిక సామర్థ్యాలను పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సిక్కిం స్కౌట్స్ బెటాలియన్ నుండి 45 మంది సిబ్బంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే క్విక్ రియాక్షన్ ఫోర్స్ బెటాలియన్ నుంచి మరికొంత మంది ఉన్నారు. నోమాడిక్ ఎలిఫెంట్ పేరుతో నిర్వహించే ఈ ప్రారంభ కార్యక్రమానికి మంగోలియా రాయబారి దంబజావిన్ గన్‌బోల్డ్, భారత సైన్యంలోని 51 సబ్ ఏరియా కమాండింగ్ జనరల్ ఆఫీసర్ మేజర్ జనరల్ ప్రసన్న జోషి హాజరయ్యారు. రెండు దేశాలు ఉమ్మడి కార్యకలాపాలకు సంబంధించిన వ్యూహాలు, పద్ధతులు, విధానాల్లో తమ ఉత్తమ అభ్యాసాలను పంచుకునేందుకు ఈ విన్యాసాలు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమ ముగింపు వేడుకకు మంగోలియా సాయుధ దళాల చీఫ్ జ్ఞాన్‌బ్యాంబ సన్‌రేవ్ అటెండ్ అవనున్నారు.


Similar News