Submarine : రెండు నెలల్లో నేవీ అమ్ములపొదిలోకి ‘ఐఎన్ఎస్ అరిఘాత్’.. ఏమిటిది ?
దిశ, నేషనల్ బ్యూరో : భారత నేవీ అమ్ములపొదిలో ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ పేరు కలిగిన న్యూక్లియర్ జలాంతర్గామి 2018 సంవత్సరం నుంచే అందుబాటులో ఉంది.
దిశ, నేషనల్ బ్యూరో : భారత నేవీ అమ్ములపొదిలో ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’ పేరు కలిగిన న్యూక్లియర్ జలాంతర్గామి 2018 సంవత్సరం నుంచే అందుబాటులో ఉంది. రాబోయే రెండునెలల్లోగా ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ పేరు కలిగిన మరో అత్యాధునిక న్యూక్లియర్ మిస్సైల్స్ జలాంతర్గామి నేవీ చేతికి అందనుంది. ‘ఐఎన్‌ఎస్ అరిహంత్’లా ఇది సాధారణమైన జలాంతర్గామి కాదు. న్యూక్లియర్ వార్ హెడ్‌లతో కూడిన బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించే సామర్థ్యం ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ సొంతం. దాదాపు 6వేల టన్నుల బరువైన ఈ జలాంతర్గామిని విశాఖపట్నంలోని షిప్ బిల్డింగ్ సెంటర్‌లో నిర్మిస్తున్నారు.
‘ఐఎన్ఎస్ అరిఘాత్’ జలాంతర్గామి పైన భాగంలో నాలుగు గొట్టాల లాంటి నిర్మాణాలు ఉంటాయి. అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన నాలుగు కే-4 సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను వాటిలో నుంచి ఏకకాలంలో లక్ష్యం దిశగా ప్రయోగించవచ్చు. దాదాపు 3,500 కిమీకుపైగా దూరంలోని లక్ష్యాలను కూడా ఈ బాలిస్టిక్ మిస్సైళ్లు ఛేదించగలవు. ‘ఐఎన్ఎస్ అరిఘాత్’ నుంచి ఏకకాలంలో పన్నెండు కే-15 రకం సబ్‌మెరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్స్‌ను కూడా ప్రయోగించవచ్చు. టోర్పిడోలను వినియోగించే సామర్థ్యం కూడా దీనికి ఉంది.