India Eu: నీటి సంరక్షణలో భాగస్వామ్యం బలోపేతం.. ఇండియా, ఈయూ మధ్య కీలక ఒప్పందం

యూరోపియన్ యూనియన్ (ఈయూ), భారత్‌లు 8వ ఇండియా వాటర్ వీక్ సందర్భంగా బుధవారం జరిగిన సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నాయి.

Update: 2024-09-18 14:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: యూరోపియన్ యూనియన్ (ఈయూ), భారత్‌లు 8వ ఇండియా వాటర్ వీక్ సందర్భంగా బుధవారం జరిగిన సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నాయి. నీటి సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. విక్టోరియా, టాంగన్యికా సరస్సు వంటి ప్రధాన నీటి వనరులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి. స్థిరమైన పెట్టుబడులను ప్రోత్సహిస్తూ ఆవిష్కరణలు, సాంకేతికత బదిలీ చేసుకునేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ఈయూ రాయబారి హెర్వ్ డెల్పిన్ మాట్లాడుతూ..‘ఈయూ టీమ్ 8వ ఇండియా వాటర్ వీక్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది. మా ఎనిమిది సంవత్సరాల సహకారం భాగస్వామ్య నైపుణ్యం ముఖ్యమైన నీటి సవాళ్లను అధిగమించగలదని నిరూపించింది. భారత్‌తో మా భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి, ఆఫ్రికాతో కలిసి పని చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని తెలిపారు.

జలవనరుల సమగ్ర నిర్వహణ కోసం జల్ శక్తి మంత్రిత్వ శాఖ రూపొందించిన వ్యూహాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారతదేశ నీటి రంగానికి ఇండియా-ఈయూ వాటర్ పార్టనర్‌షిప్ (ఐఈడబ్లూపీ) గణనీయంగా దోహదపడిందని జల్ శక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి తెలిపారు. కాగా, 2016లో ఐఈడబ్లూపీ ప్రారంభమైంది. నీటి నిర్వహణలో సాంకేతిక, శాస్త్రీయ, విధాన ఫ్రేమ్‌వర్క్‌లను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇది మూడో దశలో ఉంది. నదీ పరీవాహక ప్రాంతం నిర్వహణ, నీటి పాలన వంటి రంగాలలో స్థిరమైన పరిష్కారాలను రూపొందించడంపై దృష్టి సారిస్తుంది. ఐఈడబ్లూపీ కింద భారత్, ఈయూలు తాపి, రామగంగ నదీ పరీవాహక ప్రాంతాల్లో నీటి సంరక్షణకు సహకరిస్తున్నాయి. 


Similar News