ఇండియా కూటమి సమిష్టిగా పని చేయాలి: సీడబ్లూసీ సమావేశంలో ఖర్గే

ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు లోపల, బయట సమిష్టిగా పని చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఢిల్లీలోని అశోక్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు.

Update: 2024-06-08 09:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంటు లోపల, బయట సమిష్టిగా పని చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఢిల్లీలోని అశోక్‌ హోటల్‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నియంతృత్వ, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు మాట్లాడారని, ఇది గత పదేళ్ల రాజకీయాలను నిర్ణయాత్మకంగా తిరస్కరించడమేనని స్పష్టం చేశారు. విద్వేష రాజకీయాలను ఎప్పటికీ ఆమోదించబోరని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలపై మాట్లాడటం కొనసాగించాలని సూచించారు. ఇండియా కూటమి కొనసాగాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ యాత్ర ఎక్కడ సాగిందో అక్కడ పార్టీ సీట్లు పెరిగాయని గుర్తు చేశారు.

న్యాయ్ యాత్ర ప్రారంభమైన మణిపూర్‌లోని రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ గెలిచిందని, నాగాలాండ్, అసోం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు వచ్చాయన్నారు. మహారాష్ట్రలోనూ అతిపెద్ద పార్టీగా అవతరించామని తెలిపారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగాయని చెప్పారు. మరికొన్ని రాష్ట్రాల్లో పనితీరుపై సమీక్షించాల్సిన అవసరం ఉందని, అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చిన రాష్ట్రాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. త్వరలోనే ప్రతి రాష్ట్రంలో విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తామని, పార్టీ ఓట్ల శాతాన్ని పెంచేదుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ తన పని తాను చేస్తుందని, ప్రజా సమస్యలను లేవనెత్తుతూ 24 గంటలు, 365 రోజులు ప్రజల మధ్యే ఉంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.

ప్రతిపక్ష నేతగా రాహుల్ !

సీడబ్లూసీ సమావేశంలో భాగంగా లోక్ సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ ఉండాలని పలువురు నేతలు సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై సీడబ్లూసీ భేటీలో చర్చించినట్టు సమాచారం. అయితే సీడబ్లూసీలో తీసుకున్న నిర్ణయాలను మరికాసేపట్టో జైరాం రమేశ్ వెల్లడించనున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ రాహుల్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఐదోసారి ఎంపీగా ఎన్నికయ్యారని, ఆయన సీనియర్ ఎంపీ కాబట్టి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉండాలని తెలిపారు.


Similar News