పార్టీ నుంచి అభిజిత్ దాస్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నాయకుడు అభిజిత్ దాస్‌‌ను ఆ పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో పాటు షోకాజ్ నోటీసు జారీ చేశారు.

Update: 2024-06-19 09:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నాయకుడు అభిజిత్ దాస్‌‌ను ఆ పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేయడంతో పాటు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీపై డైమండ్‌ హార్బర్‌ నుంచి పార్టీ అభ్యర్థిగా అభిజిత్ దాస్‌ పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత హింస చెలరేగడంతో దీని గురించి మరింత సమాచారం కోసం డైమండ్ హార్బర్‌లోని వివిధ ప్రాంతాలను త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బీజేపీ కేంద్ర బృందం మంగళవారం సందర్శిస్తున్న సమయంలో దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని అమ్తాలా వద్ద అదే పార్టీకి చెందిన స్థానిక కార్యకర్తలలో కొంతమంది నిరసనలు చేశారు.

జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ ముగిసినప్పటి నుండి పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, నాయకులు తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర బీజేపీ యూనిట్ విచారణ చేయగా, బృందం సందర్శన సమయంలో నిరసనలు చేసిన వారు అభిజిత్ దాస్‌‌‌కు అత్యంత సన్నిహితులేనని తేలింది. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన కింద, రాష్ట్ర బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాటు, తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ మాట్లాడుతూ, అభిజిత్ దాస్‌‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, నిరసనలో ఆయన సన్నిహితులు పాల్గొన్నారు. దీనిపై వచ్చే ఏడు రోజుల్లో సమాధానం ఇవ్వాలి, హైకమాండ్ నుండి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు అతని సభ్యత్వాన్ని కూడా తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలిపారు. దాస్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నుండి టీఎంసీకి చెందిన అభిషేక్ బెనర్జీ చేతిలో 7.1 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు.


Similar News