UP: ట్రాక్‌పై రీల్స్.. రైలు ఢీకొని దంపతులు, కొడుకు మృతి

ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొని దంపతులతో పాటు వారి కొడుకు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-09-11 11:22 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొని దంపతులతో పాటు వారి కొడుకు మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ ఉమరియా గ్రామ సమీపంలో ఆయిల్ రైల్వే క్రాసింగ్ వద్ద పట్టాలపై మహ్మద్ అహ్మద్ (26), అతని భార్య నజ్నీన్ (24), వారి మూడేళ్ల కుమారుడు అబ్దుల్లా రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో అటువైపుగా వచ్చిన ప్యాసింజర్ రైలు వారిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం 11:00 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ, దంపతులు తమ కొడుకుతో కలిసి రైల్వే లైన్‌పై చాలా సేపు రీల్స్ చేశారని అలా చేస్తున్న క్రమంలో రైలు వచ్చి ముగ్గురినీ ఢీకొట్టిందని తెలిపారు. ఖేరీ టౌన్ కొత్వాలి ఇన్‌చార్జి అజీత్ కుమార్ మాట్లాడుతూ, కుటుంబం రైల్వే ట్రాక్‌పై రీల్‌ను రికార్డ్ చేస్తుండగా రైలు వారిని ఢీకొట్టింది. వారిది తాపూర్ జిల్లాలోని షేక్ తోలాలోని లాహర్‌పూర్. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.


Similar News