కోచింగ్ సెంటర్లు వ్యాపారమయంగా మారిపోయాయి- జగదీప్ ధన్ కర్

ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ప్రధాన ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది. రాజ్యసభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ కర్ (Jagdeep Dhankhar ) కోచింగ్ సెంటర్లపై ఆందోళన వ్యక్తం చేశారు.

Update: 2024-07-29 10:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ కోచింగ్‌ సెంటర్‌ ప్రధాన ఘటనపై రాజ్యసభలో చర్చ జరిగింది. రాజ్యసభ ఛైర్మన్‌, ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ కర్ (Jagdeep Dhankhar ) కోచింగ్ సెంటర్లపై ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్‌ సెంటర్లు పూర్తిగా వ్యాపారమయంగా మారిపోయాయని పేర్కొన్నారు. ‘‘ వాస్తవానికి కోచింగ్ అనేది వాణిజ్యంగా ఎప్పుడో మారింది. న్యూస్‌ పేపర్‌ ఎప్పుడు చదివినా తొలి రెండు పేజీల్లో ఇలాంటి ప్రకటనలే కన్పిస్తాయి” అని అన్నారు. ఈ అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ సముచితమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై అఖిల పక్షాలతో కలిపి ఇన్‌-ఛాంబర్‌ మీటింగ్‌ ఏర్పాటుచేయనున్నట్లు వెల్లడించారు.

లోక్ సభలో చర్చ

లోక్‌సభలో జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ బన్సూరి స్వరాజ్ ఈ అంశం గురించి మాట్లాడారు. ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అభ్యర్థుల మరణాలకు "నేరపూరిత నిర్లక్ష్యం" కారణమని ఆరోపించారు. ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిని సందర్శించిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నగదు పరిహారం కోసం డిమాండ్‌ చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పూర్నియాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ పప్పు యాదవ్ కూడా దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు తానియా సోని, శ్రేయా యాదవ్, నవిన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్‌ సెంటర్‌ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌ సహా ఏడుగురిని అరెస్టు చేశారు.


Similar News