ఐఎండీ రెడ్ అలర్ట్.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండ్రోజులపాటు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెండ్రోజులపాటు ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వచ్చే రెండ్రోజుల్లో కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవాలో 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ సైంటిస్ట్ సురేశ్ కుమార్ తెలిపారు. గోవాలో గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో అప్రమత్తమైన గోవా విద్యాశాఖ అక్కడి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాలు, ఐఎండీ రెడ్ అలర్ట్ దృష్ట్యా అన్ని విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించామని గోవా విద్యాశాఖ డైరెక్టర్ శైలేష్ జింగ్డే తెలిపారు.
ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్
మహరాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మరోవైపు, వచ్చే రెండ్రోజుల్లో ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అరుణాచల్, అసోం, మేఘాలయ, సిక్కిం, బిహార్ లో భారీ వర్షాలు పడతాయని.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో వచ్చే మూడ్రోజులపాటు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఢిల్లీకి భారీ వర్షసూచన లేదన్న ఐఎండీ.. అక్కడ తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ ఉందంది.