IIT Mandi: వంతెనలను పర్యవేక్షించే వినూత్న పద్ధతిని కనుగొన్న ఐఐటీ మండి టీమ్
ట్రాఫిక్ డేటాను ఉపయోగించి కాలం చెల్లిన వంతెన నాణ్యతను పర్యవేక్షించడానికి బృందం ఒక ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేసింది
దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మండి పరిశోధనా బృందం వంతెనకు సంబంధించి అంశంలో అరుదైన పురోగతిని సాధించింది. ట్రాఫిక్ డేటాను ఉపయోగించి కాలం చెల్లిన వంతెనల నాణ్యతను పర్యవేక్షించడానికి బృందం ఒక ప్రత్యేకమైన పద్ధతిని అభివృద్ధి చేసింది. ఈ బృందానికి స్కూల్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుభామోయ్ సేన్ నాయకత్వం వహించగా, అతని రీసెర్చ్ స్కాలర్ ఈశ్వర్ కుంచం కూడా బృందంలో ఉన్నారు. వారు అభివృద్ధి చేసిన ఈ విధానం ద్వారా కాలం చెల్లిన మౌలిక నిర్మాణాల నిర్వహణ విషయంలో ప్రభుత్వ ఏజెన్సీలు, ఇతర విభాగాలకు ఆచరణాత్మక, సమర్థవంతమైన పరిష్కారాలు లభిస్తాయి. ప్రధానంగా.. నిర్మాణం మొత్తాన్ని పర్యవేక్షించడం కంటే వంతెనలోని అత్యంత క్లిష్టమైన భాగంపై దృష్టి సారించి స్వల్పంగా, నష్టం జరిగే అవకాశం ఉన్న ప్రదేశంలో సమస్యను పరిష్కరించవచ్చని తమ పరిశోధనలో తేలినట్టు బృందం వివరించింది.
తమ పరిశోధన డిజిటల్ మోడల్‌లో ఉంటుందని, నిర్మాణానికి సంబంధించిన వర్చువల్ చిత్రం ఆధారంగా వంతెనలో కాలక్రమేణా ఏయే భాగాలు ఎలా ప్రభావితం అయ్యాయో అంచనా వేయవచ్చు. దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించేందుకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధనా బృందం చెబుతోంది. దీని తర్వాత, వంతెనపై ఒత్తిడి, వైబ్రేషన్‌ను పర్యవేక్షించేందుకు కీలకమైన చోట్ల సెన్సార్‌లను ఉంచుతారు. డిజిటల్ మోడల్ నుంచి రియల్-టైమ్ డేటా, ట్రాఫిక్ మోడల్ కాలక్రమేణా వంతెనపై ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునేందుకు నిపుణులకు సహాయపడతాయి. ఈ పరిశోధన క్లిష్టమైన వంతెనలను పర్యవేక్షించడమే కాకుండా చాలావరకు ఖర్చులను తగ్గిస్తుందని, ఎక్కువ పరికరాల అవసరాన్ని తగ్గిస్తుందని డాక్టర్ సుభమోయ్ సేన్ పేర్కొన్నారు.