రెండో పెళ్లి కావాలంటే ఇప్పుడే చేసుకో..ఎన్నికలయ్యాక కుదరదు: అసోం సీఎం వార్నింగ్
ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ పై అసోం సీఎం హిమంత బిస్వశర్మ మండిపడ్డారు. ‘అజ్మల్‌కు మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఎన్నికలకు ముందే చేసుకోవాలి..
దిశ, నేషనల్ బ్యూరో: ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ పై అసోం సీఎం హిమంత బిస్వశర్మ మండిపడ్డారు. ‘అజ్మల్‌కు మరో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే ఎన్నికలకు ముందే చేసుకోవాలి..ఎందుకంటే ఎలక్షన్ అనంతరం రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలులోకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం మరో పెళ్లి చేసుకుంటే నేరం అవుతుంది. కాబట్టి ఎన్నికలు అయిపోయాక పెళ్లి చేసుకుంటే జైలుకు పంపిస్తాం’ అని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ యూసీసీ అమలు చేసి తీరుతామని తేల్చి చెప్పారు. కాగా, అసోంలోని ధుబ్రీ నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడు సార్లు గెలుపొందిన అజ్మల్ మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడి ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ..తన పని అయిపోయిందంటూ విమర్శలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హుస్సేన్ వ్యాఖ్యలపై స్పందించారు. నా పని అయిపోలేదని ఈ వయసులోనూ మరో పెళ్లి చేసుకునే సామర్థ్యం నాకు ఉందని తెలిపారు. నేను ఇలా చేయడం సీఎంకు ఇష్టం లేదని..అయినప్పటికీ పెళ్లి చేసుకుని తీరుతానని చెప్పారు.
ఈ వ్యాఖ్యలపై తాజాగా బిస్వశర్మ స్పందించారు. ‘అజ్మల్ ఇప్పుడు రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అభ్యంతరం లేదు. పెళ్లికి పిలిస్తే నేను కూడా వెళ్తా. ఎందుకంటే ఇప్పుడు యూసీసీ అమలులో లేదు. కానీ ఎన్నికల తర్వాత బహుభార్యత్వాన్ని నిషేధిస్తాం. మొత్తం డ్రాఫ్ట్ ఇప్పటికే సిద్ధం చేశాం. అప్పుడు పెళ్లి చేసుకుంటే జైలు శిక్ష ఖాయం’ అని చెప్పారు. కాగా, అసోం ప్రభుత్వం గత నెలలో అస్సాం ముస్లిం వివాహాలు, విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేసిన విషయం తెలిసిందే.