'మోడీ ఓ విష సర్పం'.. మల్లికార్జున ఖర్గే విమర్శలపై మండిపడుతున్న బీజేపీ శ్రేణులు

Update: 2023-04-27 13:49 GMT

కలబురగి (కర్ణాటక): జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీని ఓ విష సర్పంగా అభివర్ణించారు. దీంతో బీజేపీ అహం దెబ్బతిన్నట్టయింది. కాంగ్రెస్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు. కర్ణాటకలోని కలబురగిలో జరిగిన ఎన్నికల సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘ప్రధాని మోడీ విష సర్పం లాంటి వాడు. అది విషమా? కాదా? అని మీరనుకోవచ్చు. కానీ దానిని రుచి చూస్తే మరణం తథ్యం’ అని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ‘మౌత్ కా సౌదాగర్’ అని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ గతంలో చేసిన వ్యాఖ్య కంటే ఇది చాలా దారుణంగా ఉందన్నారు.

‘మల్లికార్జున ఖర్గేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసింది. కానీ ఆయనను ఎవరూ పరిగణించడం లేదు. సోనియా గాంధీ చేసిన వ్యాఖ్య కంటే దారుణమైన వ్యాఖ్య చేయాలని ఆయన భావించారు’ అని ఠాకూర్ అన్నారు. 2007 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ మౌత్ కా సౌదాగర్ అని మోడీ ఉద్దేశించి అన్నారు. మోడీపై చేసిన వ్యాఖ్యలకు ఖర్గే క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే డిమాండ్ చేశారు. ‘సీనియర్ నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రపంచానికి ఏం చెప్పదలచుకున్నారు. నరేంద్ర మోడీ మన దేశానికి ప్రధాని.

ప్రపంచం మొత్తం ఆయనను గౌరవిస్తోంది. ప్రధాన మంత్రిని అలా అనడం కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారిందో తెలియజేస్తోంది. ఆయన (ఖర్గే) దేశానికి క్షమాపణలు చెప్పాలని కోరుతున్నాం’ అని కరంద్లాజే అన్నారు. అయితే ప్రధాని మోడీపై ఖర్గే మాటల దాడి చేయడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోడీని 100 తలల రావణాసుడిగా ఖర్గే అభివర్ణించారు. అహ్మదాబాద్ నగర ఎన్నికల ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ.. తన ముఖం చూసి ఓటేమని ప్రజలను మోడీ అడిగినట్టు చెప్పారు.

‘మోడీ జీ ప్రధాన మంత్రి. తన పనిని మరచిపోయి కార్పొరేషన్ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు ఇలా అన్ని చోట్ల ప్రచారం చేస్తూనే ఉన్నారు. అన్ని సందర్భాల్లోనూ తన గురించే చెబుతున్నారు. మీరు వేరే వాళ్లను చూడకండి.. మోడీని చూసి ఓటేయండి అని అన్నారు. మేము మీ ముఖాన్ని ఎన్నిసార్లు చూడాలి. మీకు ఎన్ని రూపాలు ఉన్నాయి? రావణాసురుడికి ఉన్నట్టు 100 తలలు ఉన్నాయా?’ అని ఖర్గే అన్నారు.

Tags:    

Similar News