అసోంలో బహుభార్యత్వంపై నిషేధం!

అస్సాంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బహుభార్యత్వ వ్యతిరేక చట్టాన్ని ప్రవేశ పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

Update: 2023-07-13 14:55 GMT

గౌహతి: అస్సాంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బహుభార్యత్వ వ్యతిరేక చట్టాన్ని ప్రవేశ పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమల్లోకి వస్తే ఈ చట్టం అవసరం లేదన్నారు. బహుభార్యత్వ వ్యతిరేక చట్టాన్ని విపక్ష కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే అవకాశం ఉన్న నేపథ్యంలో శర్మ ఆ పార్టీపై ఎదురు దాడికి దిగారు. ‘కాంగ్రెస్ నాయకులకు ఆడపిల్లలుంటే.. అప్పటికే ఇద్దరు భార్యలున్న వారికిచ్చి పెళ్లి చేస్తారా..?’ అని నేరుగా ప్రశ్నించారు.

బహుభార్యత్వానికి వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించే అధికారం రాష్ట్ర అసెంబ్లీకి ఉందో.. లేదో.. పరిశీలించేందుకు నలుగురు సభ్యుల నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది. రిటైర్డ్ జస్టిస్ రూమీ ఫూకాన్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను రెండు నెలల్లో సమర్పించాల్సి ఉంది. ముస్లిం పర్సనల్ లా (షరియత్) యాక్ట్, ఏకరీతి సివిల్ కోడ్, మనస్సాక్షి, మత స్వేచ్ఛ, హక్కును కల్పించే రాజ్యంగంలోని 25వ అధికరణను ఈ కమిటీ పరిశీలిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యూనిఫాం సివిల్ కోడ్‌లో భాగంగానే రాష్ట్రంలో బహుభార్యత్వంపై నిషేధం విధించాలనుకుంటున్నామని శర్మ తెలిపారు.


Similar News