Drone : మా ఇంటిపై డ్రోన్లతో నిఘా పెట్టారు.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ

దిశ, నేషనల్ బ్యూరో : తన ఇంటిపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రోన్లతో నిఘా పెట్టిందని హిమాచల్‌ప్రదేశ్ విపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే జైరాం ఠాకూర్ ఆరోపించారు.

Update: 2024-08-30 13:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తన ఇంటిపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రోన్లతో నిఘా పెట్టిందని హిమాచల్‌ప్రదేశ్ విపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే జైరాం ఠాకూర్ ఆరోపించారు. ఇప్పటికే తన ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. ఇప్పుడు డ్రోన్లతోనూ నిఘా పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీకి బయలుదేరుతుండగా.. ఇంటిపై డ్రోన్ చక్కర్లు కొడుతుండటాన్ని తాను చూశానన్నారు. గతంలోనూ చాలాసార్లు డ్రోన్లు అనుమానాస్పదంగా తన ఇంటిపై నుంచి వెళ్లాయని పేర్కొన్నారు. తన ప్రైవసీకి భంగం కలిగించేలా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని జైరాం ఠాకూర్ విమర్శించారు. హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు ఇప్పటికైనా మౌనం వీడి, దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ ఆరోపణలపై స్పందించిన సీఎం సుఖ్విందర్.. బీజేపీ ఎమ్మెల్యే జైరాం ఠాకూర్‌పై తాము డ్రోన్లతో నిఘా పెట్టలేదని స్పష్టం చేశారు. జీఐ మ్యాపింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ అవసరాల కోసం షిమ్లా నగరమంతటా డ్రోన్లు సంచరిస్తున్నాయని, ఒక్క జైరాం ఠాకూర్ ఇంటిపైనే అవి తిరిగాయి అనడం కరెక్టు కాదన్నారు. ఒకవేళ బీజేపీ ఎమ్మెల్యే జైరాం ఠాకూర్‌ ప్రైవసీకి భంగం కలిగించేలా ఏదైనా జరిగి ఉంటే తప్పకుండా విచారణ చేయిస్తామని సీఎం తెలిపారు.


Similar News