నేను అన్వేషకుడిని.. రెండింటినీ అన్వేషిస్తా : ISRO Chief

చంద్రుడి, సూర్యుడి అంతు తేల్చేందుకు తెగ కష్టపడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ దైవ భక్తుడు కూడా అనే విషయం అందరికీ తెలిసిందే.

Update: 2023-08-28 15:13 GMT

తిరువనంతపురం: చంద్రుడి, సూర్యుడి అంతు తేల్చేందుకు తెగ కష్టపడుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్. సోమనాథ్ దైవ భక్తుడు కూడా అనే విషయం అందరికీ తెలిసిందే. తాను అన్వేషకుడినని, చంద్రుడితో పాటు అంతర్గత అంతరిక్షాన్ని సైతం అన్వేషిస్తానని, సైన్స్, అధ్యాత్మికం.. రెండింటినీ అన్వేషించడం తన జీవిత ప్రయాణంలో ఒక భాగమని స్పష్టం చేశారు. అందుకే అనేక దేవాలయాలను సందర్శిస్తానని చెప్పారు. ఆయన సోమవారం తిరువనంతపురంలోని పౌర్ణమి కావు, భద్రకాళి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఎన్నో గ్రంథాలను చదివానని తెలిపారు. బాహ్య ప్రపంచ శోధన కోసం సైన్స్‌పై ఆధారపడతానని, అంతర్గత శోధన కోసం దేవాలయాలకు వెళ్తానని పేర్కొన్నారు.

2025 నాటికి అంతరిక్షయానం..

చంద్రయాన్-3 ప్రయోగం గురించి సోమనాథ్ వివరిస్తూ.. చంద్రుని దక్షిణ ధ్రువంపై సూర్య రశ్మి తక్కువగా పడుతుందని, ఆ ప్రాంతంలో పరిశోధనకు ఎక్కువ కంటెంట్ లభించే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా చంద్రుని దక్షిణ ధ్రువంపై పరిశోధనకు ఎక్కువ ఆసక్తి కనబర్చారన్నారు. భారత దేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమమైన గగన్‌యాన్ ప్రోగ్రాం పురోగతిలో ఉందని, 2025 నాటికి భారత దేశపు శాస్త్రవేత్తల తొలి సిబ్బందితో ఈ మిషన్ జరిగే అవకాశం ఉందని వివరించారు.

గగన్‌యాన్ కార్యక్రమంలో మొదటి దశను ఇస్రో నిర్వహించే అవకాశం ఉందన్నారు. అంతరిక్షంలో సిబ్బంది పనితీరు, అక్కడి వాతావరణాన్ని తట్టుకునే సామర్థ్యాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో పరిశీలిస్తామన్నారు. తర్వాత అనేక పరీక్షా మిషన్లు నిర్వహిస్తామని, చివరికి గగన్‌యాన్ ప్రోగ్రామ్ మూడో దశను నిర్వహిస్తామని తెలిపారు.


Similar News