లైంగిక వేధింపుల వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ నివాసం వద్ద హైడ్రామా

రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెల్లడం సంచలనంగా మారింది.

Update: 2023-03-19 06:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీ నివాసానికి ఢిల్లీ పోలీసులు వెల్లడం సంచలనంగా మారింది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన ‘లైంగిక వేధింపుల’ వ్యాఖ్యలపై మరింత సమాచారం తెలపాలంటూ లా అండ్ ఆర్డర్ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాగర్ ప్రీత్ హుడా నేతృత్వంలోని ఢిల్లీ పోలీసు టీమ్ బృందం తుగ్లక్ లైన్ 12లోని రాహుల్ నివాసానికి వెళ్లింది. ఇటీవల జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలోని మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారు అని చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

రాహుల్ ఆరోపిస్తున్న బాధితులకు భద్రత కల్పించేందుకు వీలుగా లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళల వివరాలు తెలపాలని కోరేందుకు ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే పోలీసుల తీరుపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. పోలీసుల చర్యలు రాజకీయ వేధింపుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. ఆ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర ముగిసి 45 రోజులు గడుస్తోందని ఇన్ని రోజులుగా లేని నోటీసులు ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసుల చర్యపై చట్టప్రకారం స్పందిస్తామని స్పష్టం చేశారు.

Tags:    

Similar News