'కార్బీవ్యాక్స్' వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ అనుమతి

బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా కార్బీవ్యాక్స్‌ను అత్యవసర వినియోగ జాబితాకు డబ్ల్యూహెచ్‌ఓ గ్రీన్ సిగ్నల్

Update: 2024-01-16 14:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఈ అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ కార్బీవ్యాక్స్‌ను అత్యవసర వినియోగ జాబితాలో చేర్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది ప్రొటీన్ సబ్ యూనిట్ ప్లాట్‌ఫామ్‌పై దేశీయంగా తయారైన మొదటి కొవిడ్ వ్యాక్సిన్ కావడం గమనార్హం. ఇప్పటికే కార్బీవ్యాక్స్‌కు డీజీసీఐ నుంచి అనుమతి లభించింది. ఇప్పటివరకు 10 కోట్ల కార్బీవ్యాక్స్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి కంపెనీ అందజేసింది. దీన్ని చాలావరకు 12-14 ఏళ్ల వయసు పిల్లలకు వినియోగించారు. ఈ క్రమంలోనే కార్బీవ్యాక్స్ టీకాను అత్యవసర వినియోగం కింద ఇవ్వొచ్చని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఈ సందర్భంగా మాట్లాడిన బయోలాజికల్-ఈ సంస్థ ఎండీ మహిమ దాట్ల, తమ వ్యాక్సిన్ డబ్ల్యూహెచ్ఓ నుంచి ఎమర్జెన్సీ లిస్టింగ్ పొందడం సంతోషంగా ఉందన్నారు. దీని తర్వాత తాము కొవిడ్ టీకాల తయారీని మరింత వేగవంతం చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిలువరించేందుకు తమవంతు సాయం అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. అనేక దేశాలు కొవిడ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నాయి. అలాంటి వారికి తమ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. అందరికీ లభించేలా, నాణ్యమైన టీకాను అందించాలనేది తమ ఉద్దేశం. డబ్ల్యూహెచ్ఓ నుంచి అనుమతి రావడం దీనికి మరింత ఊతం లభించినట్టు అయ్యిందని మహిమ దాట్ల పేర్కొన్నారు. 

Read More..

వీటిని ఎక్కువగా తీసుకుంటే బరువు పెరగడమే కాదు, షుగర్, బీపీలొస్తాయి.. జాగ్రత్త

Tags:    

Similar News