మహారాష్ట్రలో శాసనమండలి ఎన్నికల పోరు.. రిసార్టు రాజకీయాల జోరు

లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మరో పోరు నెలకొంది. మహారాష్ట్రలోని 11 శాసన మండలి స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది.

Update: 2024-07-12 05:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య మరో పోరు నెలకొంది. మహారాష్ట్రలోని 11 శాసన మండలి స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. కాగా.. 11 స్థానాలకు గాను 12 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే, క్రాస్ ఓటింగ్ ముప్పు ఉందని భావించిన అధికార మహాయుతి కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ రిసార్ట్ రాజకీయాలు చేస్తోంది. రెండు కూటములు తమ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మెల్యేలను ఫైవ్ స్టార్ హోటళ్లు, రిసార్టుల్లోకి మార్చాయి.

ఎన్నికల బరిలో 12 మంది

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 9 మంది అభ్యర్థులను నలిబెట్టింది. ప్రతిపక్ష ఇండియా కూటమి ముగ్గుర్ని నిలబెట్టింది. బీజేపీ ఐదుగురిని, షిండే గ్రూపు ఇద్దరిని, అజిత్ పవార్ ఎన్సీపీ కూడా ఇద్దరు అభ్యర్థులను పోటీలో నిలబెట్టింది. కాంగ్రెస్ ఒకరిని, ఉద్ధవ్ ఠాక్రే శివసేన యూబీటీ ఒకరిని బరిలో దింపింది. జయంత్ పాటిల్ కు చెందిన పీడబ్ల్యూపీ కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టింది. అయితే, శరద్ పవార్ ఎన్సీపీ మాత్రం ఎవరినీ నిలబెట్టకుండా పీడబ్ల్యూపీ అభ్యర్థికి మద్దతు తెలిపింది. శాసనమండలి ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మినహా ఏ పార్టీకి తమ అభ్యర్థులను గెలిపించే సంఖ్యాబలం లేదు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ స్థానం 274, కాబట్టి ఒక ఎమ్మెల్సీ సీటు గెలవాలంటే మొదటి ప్రాధాన్యత ఆధారంగా కనీసం 23 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీకి 40 మంది ఎమ్మెల్యేలు, షిండే నేతృత్వంలోని శివసేనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కాకుండా, ఇతర మిత్రపక్షాలు, స్వతంత్ర ఎమ్మెల్యేలతో సహా 203 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఎన్డీఏ చెప్పింది. అయితే, ఈ ప్రాతిపదికన అధికార పార్టీ మరో నలుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటే మొత్తం 9 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలుపొందొచ్చు. కానీ, అందుకు ఇతర చిన్న పార్టీలను గుప్పిట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది.

ప్రతిపక్షం పరిస్థితి ఇలా..

ప్రతిపక్ష మహావికాస్ అఘాడీకి కేవలం 72 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. కాంగ్రెస్‌లో 37 మంది, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు 16 మంది, శరద్ పవార్ ఎన్సీపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ నుంచి ఇద్దరు, సీపీఎం నుంచి ఇద్దరు సహా ముగ్గురు స్వతంత్రుల మద్దతు ఉంది. అయితే, ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ప్రతిపక్షం మూడు స్థానాలను గెలుచుకోగలదు. అయితే, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉంటేనే అది సాధ్యం అవుతోంది. ఇదిలావుండగా, శాసన మండలి ఎన్నికల కోసం ప్రతిపక్ష వ్యూహంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల విందు సమావేశానికి ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్, జయంత్ పాటిల్ హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం ఓటు వేయాలని కోరుతూ తమ ఎమ్మెల్యేలకు ప్రతి పార్టీ విప్ జారీ చేసింది.


Similar News