మణిపూర్ చేరుకున్న అమిత్ షా.. హింస తర్వాత తొలిసారి పర్యటన
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హింసాత్మక మణిపూర్‌కు చేరుకున్నారు.
న్యూఢిల్లీ: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం హింసాత్మక మణిపూర్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేయడంతో పాటు సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు పలుసార్లు భద్రతా అధికారులతో సమావేశాలు నిర్వహిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మే 3వ తేదీన జాతి ఘర్షణలు జరిగిన తర్వాత అమిత్ షా ఈశాన్య రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి.
హోంమంత్రి మే 29 నుంచి జూన్ 1వ తేదీ వరకు రాష్ట్రంలో ఉంటారు. ఈ పర్యటనలో మేతీ, కుకీ కమ్యూనిటీ ప్రతినిధులను కూడా కలవనున్నారు. జాతి ఘర్షణల్లో 75 మందికి పైగా మరణించారు. షెడ్యూల్డ్ తెగ హోదా కోసం మేతీ కమ్యూనిటీ డిమాండ్‌కు వ్యతిరేకంగా మే 3వ తేదీన గిరిజన సంఘీభావ యాత్ర జరిగిన సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ ప్రజలపై కాల్పులు జరుపుతూ.. ఇళ్లను తగలబెట్టిన 40 మంది సాయుధ ఉగ్రవాదులను హతమార్చినట్టు ఆదివారం ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ నుంచి కుకీ గ్రామస్తులను తొలగించడంపై తొలుత చిన్న చిన్న ఆందోళనలు జరిగాయి. తర్వాత అది తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. హింసాకాండకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు షా ఆదేశాలు జారీ చేశారు.