Hindenburg: హిండెన్ బర్గ్ నివేదిక వెనుక అంతర్జాతీయ కుట్ర.. ఆల్ ఇండియా బార్ అసోసియేషన్
హిండెన్ బర్గ్ తాజాగా వెల్లడించిన నివేదిక వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ అదిష్ అగర్వాలా ఆరోపించారు.
దిశ, నేషనల్ బ్యూరో: హిండెన్ బర్గ్ తాజాగా వెల్లడించిన నివేదిక వెనుక అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ అదిష్ అగర్వాలా ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఇటువంటి నివేదికలను వెల్లడిస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు, ఉద్రిక్త పరిస్థితులతో సతమతమవుతున్న పొరుగు దేశాల కంటే భిన్నంగా భారత ఆర్థికవృద్ధి స్థిరంగా కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుత నివేదిక కేంద్ర ప్రభుత్వం, దేశంలోని ప్రధాన వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునేందుకు శత్రు దేశాలు కుట్రలు పన్నాయని ఫైర్ అయ్యారు. భారత ఆర్థిక వ్యవస్థ పై విశ్వాసాన్ని దెబ్బతీసేందుకే ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ నివేదిక కారణంగా భారత వ్యాపారవేత్త గౌతం అదానీ కంపెనీలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయని చెప్పారు. హిండెన్ బర్గ్ ఆరోపణలకు ఒక్క ఆధారం కూడా లేదన్నారు. కాగా, సెబీ చైర్ పర్సన్ మాదభి పురి బుచ్, ఆమె భర్త ధవల్ బుచ్ పై హిండెన్ బర్గ్ సంస్థ తాజాగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.