Hindenburg : మరో బాంబు పేల్చిన ‘హిండెన్‌బర్గ్’.. సెబీ ఛైర్‌పర్సన్‌పై సంచలన ఆరోపణలు

దిశ, నేషనల్ బ్యూరో : అనుకున్నదే జరిగింది. ‘సమ్‌‌థింగ్ బింగ్ సూన్ ఇండియా’ అని శనివారం ఉదయం ట్వీట్ చేసిన అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ చెప్పినంత పనీ చేసింది.

Update: 2024-08-10 18:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో : అనుకున్నదే జరిగింది. ‘సమ్‌‌థింగ్ బింగ్ సూన్ ఇండియా’ అని శనివారం ఉదయం ట్వీట్ చేసిన అమెరికాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ కంపెనీ ‘హిండెన్‌బర్గ్ రీసెర్చ్’ చెప్పినంత పనీ చేసింది. శనివారం సాయంత్రం అది మరో సంచలన అధ్యయన నివేదికను విడుదల చేసింది. ఈసారి కూడా అదానీ గ్రూప్‌‌తో ముడిపడిన వ్యవహారాలనే హిండెన్‌బర్గ్ బయటపెట్టింది. అదానీ గ్రూపునకు విదేశాల నుంచి నిధులను సమకూరుస్తున్న పలు డొల్ల కంపెనీల్లో భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధావల్‌ బుచ్‌లకు వాటాలు ఉన్నాయని నివేదిక వెల్లడించింది. ఈవార్త స్టాక్ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బెర్ముడా, మారిషస్ దేశాల ‌నుంచి అదానీ గ్రూపునకు నిధులను సమకూరుస్తున్న డొల్ల కంపెనీలలో మాధవీ పూరీ బుచ్, ధావల్‌ బుచ్‌లకు రహస్య వాటాలు ఉన్నాయని హిండెన్‌బర్గ్ నివేదిక పేర్కొంది. ఆ రెండు దేశాలలోని డొల్ల కంపెనీలను గౌతమ్ అదానీ అన్నయ్య వినోద్ అదానీ కంట్రోల్ చేస్తున్నారని ఆరోపించింది.

అందుకే విచారణకు ఆదేశించలేదా ?

మారిషస్ సహా పలుదేశాలలోని డొల్ల కంపెనీల నుంచి అదానీ గ్రూపునకు నిధుల పంపింగ్‌పై తాము గతంలోనే వెల్లడించినా, దానిపై సెబీ ఏమాత్రం విచారణ చేయలేదని హిండెన్‌బర్గ్ గుర్తుచేసింది. ఆ డొల్ల కంపెనీల్లో వాటాలు ఉండబట్టే వాటిపై విచారణకు సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్ ఆదేశాలు జారీ చేయకపోయి ఉండొచ్చని సందేహం వ్యక్తం చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన అదానీ గ్రూపు కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేందుకు బెర్ముడా, మారిషస్‌లలోని డొల్ల కంపెనీల నుంచి వచ్చే నిధులను వినియోగించారనే సంచలన ఆరోపణ చేసింది. ‘‘బెర్ముడా, మారిషస్ దేశాలలోని డొల్ల కంపెనీల్లో సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్, ఆమె భర్త ధావల్‌ బుచ్‌లు పెట్టుబడిగా పెట్టిన డబ్బు శాలరీల ద్వారా వచ్చిందని చెప్పారు’’ అని హిండెన్‌బర్గ్ వెల్లడించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని తాము ఐఐఎఫ్ఎల్ ద్వారా సేకరించామని తెలిపింది. మాధవీ పూరీ బుచ్ దంపతులకు దాదాపు రూ.83 కోట్ల నికర సంపద ఉందని నివేదికలో ప్రస్తావించింది.

‘అగోరా అడ్వైజరీ’ సంస్థ కూడా సెబీ ఛైర్‌పర్సన్‌దే : హిండెన్‌బర్గ్

‘అగోరా అడ్వైజరీ’ అనే ఒక కన్సల్టింగ్ కంపెనీలోనూ సెబీ ఛైర్‌పర్సన్ మాధవీ పూరీ బుచ్‌కు 99 శాతం వాటా ఉందని హిండెన్‌బర్గ్ పేర్కొంది. దీనికి ఆధారంగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ వద్దనున్న సమాచారంతో కూడిన ఓ కాపీని విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. 2022 సంవత్సరంలో ‘అగోరా అడ్వైజరీ’ కన్సల్టింగ్ వ్యాపారం ద్వారా రూ.2.19 కోట్ల ఆదాయాన్ని గడించింది. ఆ ఏడాది సెబీలో ఉద్యోగం చేయడం ద్వారా మాధవీ పూరీ బుచ్‌ ఆర్జించిన శాలరీ కంటే ఇది దాదాపు 4.4 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం. ‘అగోరా అడ్వైజరీ’ని సింగపూర్ కేంద్రంగా నడిచే డొల్ల కంపెనీగా రిజిస్టర్ చేశారని.. అందువల్ల అది భారతదేశంలో ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్లను బహిర్గతపర్చాల్సిన అవసరం లేకుండా పోయిందని హిండెన్ బర్గ్ తెలిపింది. ఈ కారణం వల్ల ‘అగోరా అడ్వైజరీ’ ఎవరికి కన్సల్టింగ్ సేవలు అందించింది ? వాటి ద్వారా ఎంత ఆర్జించింది ? ఆ నిధులు ఏం చేసింది ? అనే దానిపై వివరాలు అందుబాటులో లేకుండాపోయాయని హిండెన్‌బర్గ్ నివేదిక తెలిపింది.

Tags:    

Similar News