రాహుల్ పాదయాత్రలో కమల్ హాసన్ సందడి!

హీరో కమల్ హసన్ రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్నారు.

Update: 2022-12-24 11:44 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఢిల్లీలో ప్రవేశించిన సందర్భంగా మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. రాహుల్ పాదయాత్రలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాసన్ ప్రత్యక్షమయ్యారు. భారతీయుడు సినిమా షూటింగ్ లో ఉన్న ఆయన షూటింగ్ నుంచి నేరుగా వచ్చి రాహుల్ గాంధీతో కాసేపు కలిసి నడిచారు. రాహుల్ ఆహ్వానం మేరకు ఢిల్లీకి వచ్చిన కమల్ హసన్ రాహుల్ తో పాటు కలిసి నడిచారు. ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా రాహుల్ యాత్రలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కమల్ మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్రలో పాల్గొనవద్దని, పాల్గొంటే తన రాజకీయ భవిష్యత్తు దెబ్బ తింటుందని తనకు చాలా మంది చెప్పారని అన్నారు. కానీ తనకు రాజకీయాల కంటే దేశాన్ని సమైక్యంగా ఉంచడమే ముఖ్యమని స్పష్టం చేశారు. రాహుల్ చేపట్టిన యాత్ర తననెంతో ఆకట్టుకుందని, అందుకే యాత్రలో పాల్గొన్నానని చెప్పారు. అంతకు ముందు రోజు ఢిల్లీలో నివసిస్తున్న తమిళ ప్రజలు భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం కావాలని కోరుతూ వీడియోను సైతం రిలీజ్ చేశాడు. పిలుపు ఇవ్వడమే కాకుండా స్వయంగా పాదయాత్రలో కనిపించడంతో రాజకీయ వర్గాల్లో కమల్ హాసన్ వైఖరి ఆసక్తిగా మారింది. ఈ పరిణామం రాబోయే ఎన్నికల్లో తమిళనాట రాజకీయ సమీకరణాల మార్పుకు కారణం కాబోతోందా అనే చర్చ కు దారి తీస్తోంది. గత ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యమ్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కమల్ హాసన్ తమిళ రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేసి పరాజయం పాలయ్యారు.

అయితే ఇటీవల పార్టీ పొత్తుల విషయంలో కమల్ హాసన్ సీరియస్ గా వర్క్ చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తమిళనాడులోని అధికార డీఎంకేతో కాంగ్రెస్ కు పొత్తు ఉంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కాంగ్రెస్ కు దగ్గర కావాలనే ఉద్దేశంతోనే రాహుల్ గాంధీ పాదయాత్రకు మద్దతుగా నిలిచారనే టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే సౌత్ ఇండియాలో కర్ణాటక తర్వాత మరో రాష్ట్రంలో అధికారం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీకి దాని మిత్ర పక్షం అన్నా డీఎంకేకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవా అనే టాక్ వినిపిస్తోంది. ఇటీవల పార్టీ నేతలతో భేటీ అయిన కమల్ హాసన్ ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేయాలని పొత్తుల విషయంలో ఎన్నికల సమయంలో చూసుకుందామని దిశానిర్దేశం చేశారు. తాజాగా రాహుల్ గాంధీ యాత్రకు మద్దతు తెలపడంతో ఆయన వైఖరి స్పష్టం అయిందని, భవిష్యత్ లో కాంగ్రెస్ తో కమల్ హాసన్ కలిసి పని చేయచడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News