ఆ గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు : సీజేఐ

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Update: 2024-03-21 11:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ ఆస్తుల కేసులో డీఎంకే నేత కె. పొన్ముడికి దిగువ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షపై మార్చి 11నే తాము స్టే విధించామని తెలిసినా తెలియనట్టుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. పొన్ముడిని తిరిగి తమిళనాడు మంత్రి వర్గంలోకి తీసుకునేందుకు డీఎంకే ప్రభుత్వం సిద్ధమైనా.. అందుకు అనుమతి ఇవ్వకుండా గవర్నర్ మొండిగా వ్యవహరిస్తున్నారంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ‘‘ఈ కేసులో గవర్నర్ తీరుపై మేం తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. ఆయన సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ‘‘పొన్ముడికి పడిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించిందనే విషయాన్ని గవర్నర్‌కు సెపరేటుగా చెప్పాల్సిన పనేం లేదు’’ అని తెలిపారు. అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి రిక్వెస్ట్ చేయడంతో.. ఈ అంశంపై గవర్నర్ ఆర్‌ఎన్ రవి వైపు నుంచి చర్యల కోసం శుక్రవారం సాయంత్రం వరకు వేచి చూస్తామని సీజేఐ చెప్పారు. ‘‘రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని గవర్నర్‌ను ఆదేశించడానికి మేం వెనుకాడం. పరిస్థితి అక్కడి దాకా వెళ్లకుండా చూసేందుకు మేం సమయం ఇస్తున్నాం’’ అని డీవై చంద్రచూడ్ తెలిపారు.

Tags:    

Similar News