238 సార్లు ఓడినా.. మళ్లీ పోటీకి దిగుతున్న టైర్ల రిపేర్ షాప్ ఓనర్
తమిళనాడుకు చెందిన టైర్ల రిపేర్ షాప్ ఓనర్ కె పద్మరాజన్ 238 సార్లు ఓడినా, మళ్లీ బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు
దిశ, నేషనల్ బ్యూరో: గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడమే కానీ ఓటమిని అంగీకరించలేని, విశ్లేషించుకోలేని చాలామందికి ఓ టైర్ల రిపేర్ షాప్ ఓనర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఏ ప్రయత్నమైనా, ఎలాంటి ప్రయోగమైనా ఓడకుండా విజయాన్ని దక్కించుకోవడం అంత సులభమేమీ కాదు. ఓటమిని ఆంగీకరించి తిరిగి పోరాడేందుకు ఒక జీవితానికి సరిపడా తెగువ కావాలి. అలాంటిది తమిళనాడుకు చెందిన టైర్ల రిపేర్ షాప్ ఓనర్ కె పద్మరాజన్ ఏకంగా 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా సరే మళ్లీ బరిలో నిలబడేందుకు సిద్ధమవుతున్నారు.
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల సీజన్ మొదలైపోయింది. ప్రధాన పార్టీలు మొదలుకొని చిన్నా చితక, స్వతంత్ర అభ్యర్థులందరూ ప్రజల నాడీ తెలుసుకునేందుకు వీధి బాట పట్టారు. అలాగే కె పద్మరాజన్ కూడా అనేక పర్యాయాలు, దేశంలో ఏ ఎన్నికలు జరిగినా పోటీకి నిలబడతారు. ఎన్నిసార్లు ఓడిపోయినా పోటీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు రాష్ట్రపతి ఎన్నికలు మొదలుకొని స్థానిక ఎన్నికల వరకు అన్నిట్లోనూ బరిలో నిలిచారు. అలా 238 సార్లు ఓటమిని ఎదుర్కొన్నారు. 65 ఏళ్ల పద్మరాజన్ ఈ ఏడాది జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా పోటీకి నిలిచి వార్తల్లో సెలబ్రిటీ అయ్యారు.
తమిళనాడులో టైర్లను రిపేర్ చేసే దుకాణం ఉన్న కె పద్మరాజన్ 1988లో స్వస్థలమైన మెట్టూరు నుంచి ఎన్నికల్లో నిలబడటం ప్రారంభించారు. తాను ఎప్పుడు ఎన్నికల్లో నిలబడినా అందరూ నవ్వుతుంటారని, అవన్నీ లెక్కజేయనని, ఒక సాధారణ వ్యక్తి ఎన్నికల్లో పాల్గొనగలడని నిరూపించాలనుకుంటున్నట్టు పద్మరాజన్ చెప్పారు. 'ఎవరైనా ఎన్నికల్లో గెలవడానికే పోటీకి నిలబడతారు. తాను పోటీలో నిలబడటమే విజయంగా భావిస్తాను. ఓడిపోతానని తెలిసిన తర్వాత కూడా ఆ ఓటమిని సంతోషంగా స్వీకరిస్తానని' తెలిపారు. అలా ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఆరు వారాల సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్నానని పద్మరాజన్ పేర్కొన్నారు.
స్థానికంగా 'ఎలక్షన్ కింగ్' అని పిలవబడే పద్మరాజన్.. రాష్ట్రపతి నుంచి స్థానిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా అనేక ఎన్నికలలో పోటీ చేశారు. ఇప్పటివరకు అటల్ బిహారీ వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలపై కూడా పోటీ చేశారు. ఎన్నికల్లో గెలవడం ప్రధానం కాదు, ప్రత్యర్థి ఎవరు? అనే విషయాన్ని కూడా పట్టించుకోను. ఎన్నికల్లో పోటీ చేస్తూ ఎన్నిసార్లు ఓటమిని పొందడానికైనా సిద్ధమేనని పద్మరాజన్ అన్నారు. ప్రస్తుతం ఆయన తన ఓటమి పరంపరను కొనసాగించడంపై ఆందోళన చెందుతున్నట్టు చెప్పారు. ఇలా ఎన్నికల్లో పోటీ చేయడం అంత సులభమైన పనేమీ కాదన్నారు. ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేలాది రూపాయలు పోగొట్టుకున్నాను. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో నిలబడేందుకు సెక్యూరిటీ డిపాజిట్ రూ. 25,000 అవుతుంది. పోల్ అయ్యే ఓట్లలో 16 శాతం ఓట్లు రాకపోతే ఆ సెక్యూరిటీ డిపాజిట్ కూడా వాపసు రాదన్నారు.
'ఇన్ని ఓటములను ఎదుర్కొన్న తాను ఒకసారి గెలిచాను కానీ అది ఎన్నికల్లో కాదు. దేశంలోనే వివిధ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకోవడంలో గెలిచానని' చెప్పారు. 2011 సమయంలో ఇప్పటివరకు నిలబడిన ఎన్నికల్లో మెరుగైనన ఓట్లు వచ్చాయి. అప్పుడు మెట్టూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి 6,723 ఓట్లు సంపాదించానన్నారు. ఆ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా వస్తుందని అనుకోలేదన్నారు.
కె పద్మరాజన్ టైర్ల రిపే షాప్ నిర్వహణతో పాటు హోమియోపతి ఔషధాల తయారీ, స్థానిక మీడియాలో ఎడిటర్‌గా కూడా పనిచేస్తున్నారు. ఎన్ని రకాల పనులు చేసినా ఎన్నికల బరిలో ఉండటమే తనకు ముఖ్యమన్నారు. 'చాలామంది ఎన్నికల్లో పోటీకి వెనకడుగు వేస్తారు. అలాంటి వారికి ప్రేరణ కలిగిస్తూ, అవగాహన కల్పించడం, వారికి రోల్‌మోడల్‌గా ఉండటం ఇష్టం. తన చివరి శ్వాస వరకు ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటాను. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే షాక్ అవుతానని' పద్మరాజన్ వెల్లడించారు. తమిళనాడులోని ధర్మపురి పార్లమెంటు స్థానం కోసం ఇప్పటికే నామినేషన్ కూడా వేశానని చెప్పారు.