సంక్షోభంలో హర్యానా ప్రభుత్వం!..కాంగ్రెస్ లోకి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు
లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానాలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ హర్యానాలో అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వానికి ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు మంగళవారం మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు. మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేల్లో సోంబీర్ సాంగ్వాన్, రణధీర్ గొల్లెన్ ధరంపాల్ గొండర్‌లు ఉన్నారు.రైతులకు సంబంధించిన సమస్యలతో పాటు పలు అంశాలపై ప్రభుత్వం విఫలమైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా భూపిందర్ సింగ్ హుడా మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడిందని కాబట్టి వెంటనే సైనీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తెలిపారు.
కాగా, రాష్ట్రంలో బీజేపీ-జేజేపీ పొత్తు తెగిపోవడంతో స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 90 మంది ఎమ్మెల్యేలకు గాను రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం 88 మంది శాసన సభ్యులున్నారు. వీరిలో బీజేపీకి 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా,,. ప్రతిపక్షానికి 45 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి ముగ్గురు ఇండిపెండెంట్లు ఉపసంహరించుకోవడంతో ఆ సంఖ్య 40కి చేరుకుంది. మెజారిటీకి ఇంకా ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కానీ సైనీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుస్తోంది. ఎందుకంటే సైనీ ఈ ఏడాది మార్చి 12న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత బలపరీక్షలో నెగ్గారు. అయితే మరోసారి బలపరీక్ష నిర్వహించడానికి 6నెలల సమయం ఉండాలి. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం గమనార్హం.