Kolkata rape case: రోజులు గడుస్తున్నా బాధితురాలికి న్యాయం జరగలేదు

కోల్ కతా ఘటనపై మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు.

Update: 2024-08-18 11:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్ కతా ఘటనపై మాజీ క్రికెటర్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ హర్భజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ రాశారు. రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నానంటూ రెండు పేజీల లేఖలో పేర్కొన్నారు. ‘మనందరి మనసులను కలచివేసిన చెప్పలేని హింస. ఇది ఒక వ్యక్తిపై జరిగిన ఘోరమైన నేరం కాదు. మన సమాజంలోని ప్రతి మహిళ, గౌరవం, భద్రతపై జరిగిన దాడి. మన దేశంలో అనాదిగా జరుగుతున్న సమస్యలకు ఇదో ప్రతిబింబం. సమాజంలో అధికారులు, వ్యవస్థాగత మార్పులు, చర్యల తక్షణ అవసరాన్ని ఈ దారుణం గుర్తు చేస్తుంది.’ అని అన్నారు.

వైద్యుల నిరసనకు మద్దతిచ్చిన హర్భజన్ సింగ్

ఇలాంటి ఘటనలు జరగడం ఆమోదయోగ్యం కాదని హర్భజన్ సింగ్ అన్నారు. హత్యాచారం జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. వైద్యులు, వైద్య సంఘాలు రోడ్లపై నిరసనకు దిగాయని అన్నారు. డాక్టర్ల నిరసనలు అర్థం చేసుకున్నానని తెలిపారు. న్యాయం కోసం డాక్టర్లు చేస్తున్న పోరాటానికి మద్దతిస్తున్నానని అన్నారు. ఇప్పటికే సవాలుతో కూడిన పరిస్థితుల్లో డాక్టర్లు పని చేస్తున్నారని అన్నారు. భద్రతతో రాజీ పడినప్పుడు అంకితభఆవంతో తమ విధులను ఎలా నిర్వహిస్తారని ఎలా ఆశించగలం? ప్రశ్నించారు. ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరారు.


Similar News