GST Council: ఫిట్‌మెంట్ కమిటీకి ఆన్‌లైన్ లావాదేవీలపై జీఎస్టీ అంశం: ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి
వాటిలో రూ. 2,000లోపు ఆన్‌లైన్ లావాదేవీలకు పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ విధించే ప్రతిపాదనపై చర్చించారు.
దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో సోమవారం జరిగిన 54వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. వాటిలో రూ. 2,000లోపు ఆన్‌లైన్ లావాదేవీలకు పేమెంట్ అగ్రిగేటర్లకు జీఎస్టీ విధించే ప్రతిపాదనపై చర్చించారు. కానీ, తుది నిర్ణయానికి రాలేదు. దీని గురించి మాట్లాడిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్.. డిజిటల్ చెల్లింపుల అగ్రిగేటర్ల నుంచి రూ. 2 వేల కంటే తక్కువ లావాదేవీలకు వచ్చే ఆదాయంపై 18 శాతం జీఎస్టీ విధించాలా.. వద్దా అనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ అంశం తక్కువ మొత్తం ఆన్‌లైన్ చెల్లింపులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున, తదుపరి పరిశీలన కోసం జీఎస్టీ ఫిట్‌మెంట్ కమిటీకి సిఫార్సు చేసినట్టు ఆయన తెలిపారు. ఫిట్‌మెంట్ కమిటీ దీని ప్రభావం గురించి విశ్లేషిస్తుంది. అనంతరం సమగ్రమైన నివేదికను అందిస్తుంది. గణాంకాల ప్రకారం, ప్రస్తుతం దేశంలో 80 శాతం కంటే ఎక్కువ డిజిటల్ చెల్లింపులు రూ. 2 వేల పరిధిలోకి వస్తాయి. చెల్లింపుల అగ్రిగేటర్లు ప్రస్తుతం ప్రతి లావాదేవీకి 0.5 శాతం నుంచి 2 శాతం మధ్య వ్యాపారుల నుంచి వసూలు చేస్తున్నారు. ఒకవేళ తాజా ప్రతిపాదన అమలు చేస్తే, ఆ ఖర్చు వ్యాపారులపై పడుతుంది. దానివల్ల చిన్న మొత్తం లావాదేవీలపై ఆధారపడిన వ్యాపారులు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటారనే అంశం ముందుకొస్తోంది. దీనికి సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ రానున్న రోజుల్లో మరింత స్పష్టత ఇవ్వనుంది.