ఈపీఎఫ్‌ఓ వేతన పరిమితిని రూ.21,000కి పెంచే యోచనలో కేంద్రం

వేతన పరిమితిని పెంచడం ద్వారా సామాజిక భద్రతను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు

Update: 2024-04-11 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) వేతన పరిమితిని రూ. 15,000 నుంచి రూ. 21,000కు పెంచాలని కేంద్రం భావిస్తోంది. కొన్నేళ్ల నుంచి పరిమితి పెంపుపై డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా మరోసారి ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వేతన పరిమితిని పెంచడం ద్వారా సామాజిక భద్రతను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఎకనమిక్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయంపై నిర్ణయం ప్రకటించవచ్చని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కేంద్రం ఈ వేతన పరిమితిని పెంచితే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగంపై కూడా భారం ఉంటుంది. ఇది ఉద్యోగులకు ప్రయోజనం కలిగిస్తుంది. చివరిసారిగా ఈపీఎఫ్ఓ వేతన పరిమితిని 2014లో సవరించరు. ఆ సమయంలో రూ. 6,500 నుంచి రూ. 15 వేలకు చేర్చారు. ఇప్పటికే ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వేతన పరిమితిని రూ. 21 వేలకు పెంచింది. వేతన పరిమితిని పెంచడం ద్వారా ఉద్యోగుల భవిష్య నిధి అకౌంట్‌కు జమ అయ్యే మొత్తం పెరగనుంది. సాధారణంగా ఉద్యోగి వాటా వేతనంలో 12 శాతం, యాజమాన్య వాటా 12 శాతం చెల్లిస్తారు. ఉద్యోగి వాటా మొత్తం ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. వేతన పరిమితి పెంచితే దానికి అనుగుణంగా ఉద్యోగి, యాజమాన్య వాటా చెల్లించే మొత్తం పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగి రిటైర్‌మెంట్ సమయంలో భవిష్య నిధి నిల్వ కూడా పెరుగుతుంది. 

Tags:    

Similar News