కేంద్రం కొత్త నిబంధనలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అభ్యంతరం
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం తీవ్రంగా కలచి వేసినట్లు పేర్కొంది. ఈ మేరకు వెంటనే సవరించిన నిబంధనలను వెనక్కి తీసుకోవాలని కోరింది. అంతకుముందు కేంద్రం ఓ ప్రకటనలో సోషల్ మీడియా వేదికల్లో ప్రభుత్వం గురించి నకిలీ, తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రచురించడం, భాగస్వామ్యం చేయడం లేదా హోస్ట్ చేయకూడదని తెలిపింది.
నకిలీ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని గుర్తించడానికి వాస్తవాల తనిఖీ విభాగాన్ని(ఫ్యాక్ట్ చెకింగ్) నియమిస్తామని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. అయితే ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా యూనిట్ దీనిని వ్యతిరేకించింది. ఇదంతా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం, సెన్సార్‌షిప్‌కు సమానమని ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో పత్రికా స్వేచ్ఛపై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వెల్లడించింది. అటువంటి క్రూరమైన నిబంధనలను మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ఇవ్వడం విచారకరమని పేర్కొంది. ఈ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవాలని.. మీడియా సంస్థలు, పత్రికా సంస్థలతో సంప్రదింపులు జరపాలని గిల్డ్ మంత్రిత్వ శాఖను మళ్లీ కోరింది.
మరోవైపు కేంద్రం ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ ఏర్పాటుతో మాట్లాడే స్వేచ్ఛపై ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సవరణలు సెన్సార్‌షిప్‌కు దారితీస్తాయనే ఆందోళనలను మంత్రి తోసిపుచ్చారు. ఫ్యాక్ట్ చెకింగ్ విశ్వసనీయంగా జరుగుతాయని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను బయటి సంస్థలు ఫ్యాక్ట్ చెక్ చేయడం కష్టమని చెప్పారు.